పాకిస్తాన్ తో చర్చలు జరుపుతారు మాతో జరుపరా ?

👉 మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనలో..

J.SURENDER KUMAR,

పాకిస్తాన్ తో నైనా శాంతి చర్చలు జరుపుతాము కానీ ఆదివాసీలతో, వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులతో చర్చలు జరపము’ అనే మోదీ-షా ప్రభుత్వ వైఖరిని ఖండించండి తెలంగాణ లో కాల్పుల విరమణను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు .


అమిత్ షా కిసాన్ సమ్మేళన్ లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆయుధాలు చేపట్టిన వారితో చర్చలు జరపదనీ, కాబట్టి మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదనీ, 2026 మార్చ్ 31 కల్లా దేశం నుండి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని మళ్ళీ ప్రకటన చేశారని పేర్కొన్నారు.

బిజేపి ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి ముఖ్యమంత్రి మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాక అసలు ఛత్తీస్ గఢ్ ఎన్నికలకు ముందు బిజేపి తమ మానిఫెస్టోలోనే మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ప్రకటించిందని పేర్కొన్నారు.

మా పార్టీ నాయకత్వంలోని ఉద్యమ బలాబలాలతో నిమిత్తం లేకుండా ప్రజల ప్రయోజనం కోసం మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే అని ప్రకటిస్తూ వస్తున్నాం. అధికార పార్టీలే అందుకు సిద్ధంగా లేవు. మరింత నిర్దిష్టంగా తెలంగాణలో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ మార్చ్ నెలలో చర్చల కోసం పిలుపిచ్చిన తరువాత అందుకు స్పందనగా మార్చ్ 28 న మేము అందుకు సిద్ధమంటూ అందుకోసం భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేసి, కొత్త క్యాంపుల నిర్మాణం ఆపి చర్చల కోసం తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని మేము ప్రకటించాం. ఆ తరువాత మేము ఏక పక్షంగా నెలరోజుల పాటు కాల్పుల విరమణను పాటిస్తామని కూడా మా తరపున ప్రకటించాం. మేము నిజాయితీగా కట్టుబడి ఉన్నాం. అని ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలోని ఎంతో మంది మేధావులు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నాయి, అందుకోసం డిమాండ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే జస్టిస్ చంద్ర కుమార్, ప్రొ. హరగోపాల్ ల నాయకత్వంలో శాంతి చర్చల కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కలిసి కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాలని కోరారు. ఆ తరువాత ఢిల్లీ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వంతో కాల్పుల విరమణను ప్రకటింపజేసి, శాంతి చర్చలకై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని కోరారు.

బిజేపి మినహా అన్ని పార్టీలు ముక్త కంఠంతో కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నావని  ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదివాసీల మారణహోమాన్ని ఆపడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణను ప్రకటించాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేయడానికి ఉద్యమాలను నిర్మించాలని, నిరసనలను కొనసాగించాలని మేము అన్ని వామపక్ష పార్టీలను, ఇతర పార్టీలను, ప్రజాస్వామ్య, పౌర, మానవ హక్కుల సంస్థలను, వ్యక్తులను అన్ని ప్రజా సంఘాలను కూడా కోరుతున్నాము. అని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి, అభయ్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.