ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

👉 వన మహోత్సవ కార్యక్రమంలో..

J SURENDER KUMAR

ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని , ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే  రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


👉 ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం -2025 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  లాంఛనంగా ప్రారంభించారు. అటవీ శాఖ, హెచ్ఎండీఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.


👉  అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. “ఈ ఏడాది ఆటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలను నాటాలన్న బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళుతున్నాం. మనం చెట్టును కాపాడితే, చెట్టు మనల్ని కాపాడుతుంది.


👉  ఆడబిడ్డలు ఇంట్లో పిల్లలను పెంచుతున్నట్టుగానే ఇంటి ఆవరణలో కనీసం రెండు మొక్కలను నాటాలి. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అనుభవంతో నేర్చుకున్న పాఠాలు. అమ్మ పేరు మీద పిల్లలు మొక్కలు నాటాలన్న తరహాలోనే పిల్లల కోసం అమ్మ కూడా రెండు మొక్కలు నాటాలి. అలా చేస్తే తెలంగాణ మొత్తం హరితవనంగా మారుతుంది.


👉  అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నందునే ప్రభుత్వం అన్నింటిలోనూ వారికి ప్రాధాన్యతనిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలలు, సోలార్ విద్యుత్ రంగంలో ప్రోత్సాహం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో వెయ్యి బస్సులను కొని స్వయం సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు నిర్వహించడం ద్వారా బాగుంటుందని వారి చేతుల్లో పెట్టాం.


👉  హెటెక్ సిటీ వద్ద 3.5 ఎకరాల విలువైన స్థలంలో మహిళా సంఘాల (SHG) కు కేటాయించి తద్వారా వారి  ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించాం. భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అందరూ అక్కడికి వెళ్లి పరిశీలించారు. తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ.


👉  మహిళా సంఘాల్లో చేరడానికి కనిష్ట వయసును 15 సంవత్సరాలకు తగ్గించాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో సభ్యులను 67 లక్షల నుంచి కోటి మందికి పెంచి వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ఈ ఏడాది 21 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంక్ లింకేజీ ఇవ్వడం జరిగింది.


👉  నాతో పాటు వేదికపైన ఉన్న వారంతా ఇంట్లో ఏ బియ్యం తింటున్నామో ఆడబిడ్డలు కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా సన్నబియ్యం అందిస్తున్నాం. అన్ని రంగాల్లో అక్కలు, ఆడబిడ్డలు ముందుండాలి. ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశం.


👉  స్థానిక సంస్థల్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ  రిజర్వేషన్లు కల్పించినట్టుగానే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో మహిళలకు అసెంబ్లీ స్థానాల్లోనూ రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. ఆడబిడ్డలను గెలిపించుకునే పూచీ నాది. రానున్న రోజుల్లో ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపాలి..” అని అన్నారు.


👉  ఈ కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్ , కాలె యాదయ్య గారు, PJTSAU వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య , GHMC డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి , పీసీసీఎఫ్ సువర్ణ తో పాటు అటవీ శాఖ, హెచ్ఎండీఏ అధికారులు, వర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.