👉 పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో ఘనంగా మహారుద్రం !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురివేద పండితుల రుద్ర పారాయణం తో శనివారం దద్దరిల్లింది. తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి భక్తజనం తరలిరావడంతో ధర్మపురి పోటెత్తింది.

స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో వందలాది మంది వేద పండితులు రుద్ర, నమక, చమకాలతో రుద్ర పారాయణం చేశారు.





మహారుద్రం, లక్ష పుష్పార్చన కార్యక్ర మాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలచే లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే నిర్వాహకులు రుద్ర పారాయణ ప్రాంగణంలోకి అనుమతించారు.

తొగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి ఆశీస్సులు పొందడానికి భక్తజనం గంటల తరబడి వేచి ఉన్నారు. అనంతరం వేలాదిమంది కి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేసిన స్థానిక బ్రాహ్మణ సంఘ సభ్యులను పీఠాధిపతి ఆశీర్వదించి అభినందించారు.
👉 ప్రాచీన వైదిక, క్షేత్రం ధర్మపురి .
పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీస్వామి !

ప్రాచీన వైదిక, క్షేత్రం ధర్మపురి అని పౌరాణిక క్షేత్రంగా వెలుగొందిన ధర్మపురిని వారసత్వ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని పీఠాధిపతి భక్తులను ఉద్దేశించి చేసిన అనుగ్ర సంభాషణలో అన్నారు. ధర్మపురి వేదాలకు, పురాణా లకు కేంద్రంగా ధర్మపురి ఉండేదని, దీనికి పునరుత్తేజం కలిగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డిల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమునకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి (తొగుటస్వామి) స్వాములవారు మరియు శ్రీ శ్రీ శ్రీ మదుసూదానంద మహా స్వాములవారు ( తొగుట ఆశ్రమం ) ఉత్తర పీఠం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పక్షాన పూర్ణకుంభం మేల తాళాలతో స్వాగతించారు.

కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ వేద పండితులు అర్చకలతో కలిసి స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం అందించారు.
