J. SURENDER KUMAR,
తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. దీంతో కల్తీ ఆహారం కు చెక్ పడింది.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.
టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని, ఇప్పుడు తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన GC (Gas Chromatograph), HPLC (High Performance Liquid Chromatograph) వంటి పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
₹.75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా అందజేసిందని చెప్పారు. ల్యాబ్ సిబ్బంది, పోటు కార్మికులు మైసూర్‌లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సిఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.