J.SURENDER KUMAR,
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుప్రభాతసేవ నుంచి ఏకాంతసేవ వరకూ ప్రతిరోజూ జరిగే నిత్యసేవలతో పాటు ఇక వారంలో ఒక రోజు మాత్రం జరిగే శ్రీవారి పాదపద్మాలకు జరిగే అష్టదళపాద పద్మారాధనతో వారోత్సవాలు వాటి విశేషాలు.
👉 అష్టదళ పాద పద్మారాధన !
ప్రతి మంగళవారం, ఉదయం ఆరు గంటలకు, రెండవ అర్చనగా, నూట ఎనిమిది బంగారు కమలాలతో మూలవిరాట్టు పాద పద్మాలకు, సుమారు 20 నిముషాల పాటు జరిగే సేవా కార్యక్రమమే ఈ అష్టదళ పాద పద్మారాధన. ప్రతిరోజూ, స్వామివారి పాదాలకు తులసిదళాలతో ఏకాంతంగా అర్చన జరుగుతుంది. కైంకర్యపరులకు తప్ప వేరెవరికీ అది చూసి తరించే భాగ్యం లేదు. కానీ మంగళవారం మాత్రం *”అష్టదళ పాద పద్మారాధన”* ఆర్జిత సేవలో పాలు పంచుకొనే భక్తులందరూ ఈ అర్చనను చూసి తరించవచ్చు.
👉 ముస్లిం భక్తుడు !
1984 సం. లో, తి.తి.దే. స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సేవ ప్రారంభించబడింది. హైదరాబాదు, గుంటూరు వాస్తవ్యుడైన ఓ మహమ్మదీయ భక్తుడు ఇందుకు అవసరమైన 108 బంగారు పద్మాలను శ్రీవారికి కానుకగా సమర్పించాడు. స్వామివారు ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాని అఖిలాండ, బ్రహ్మాండ నాయకుడనటానికి ఇంతకంటే చక్కటి నిదర్శనం ఏం ఉంటుంది !
కొంతకాలం తరువాత ఇది ఆర్జిత సేవగా రూపు దిద్దుకుంది. అయితే, అన్ని ఇతర సేవా కైంకర్యాల లాగా ఈ అర్చన యొక్క మూలాలు కూడా ప్రాచీన కాలం నాటి ఆగమశాస్త్రం లోనే ఉన్నాయి.
👉 ఈ సేవ, ఎప్పుడు – ఎలా ప్రారంభమైంది !
దీని విషయమై ఒక ఆసక్తికరమైన, అద్భుతమైన,ఈ మధ్యకాలంలోనే జరిగిన యదార్థ సంఘటన ఉంది.
1982వ సంవత్సరంలో తి.తి.దే. బోర్డు సమావేశం జరుగుతున్నప్పుడు, షేక్ మస్తాన్ అనే ముస్లిం భక్తుడు అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి వి ఆర్ కే ప్రసాద్ ను కలుసుకునే నిమిత్తం తి.తి.దే. కార్యాలయానికి వచ్చారు. సమావేశంలో వ్యస్తుడై వుండటంవల్ల ప్రసాద్ అఇష్టంగానే ఆ భక్తుణ్ణి కలుసుకున్నారు.
👉 భక్తుని కథనం ఇలా ఉంది !
అయ్యా! గుంటూరు జిల్లాకు చెందిన మా అన్నదమ్ముల మందరం ఉమ్మడి కుటుంబంలో కలసి మెలసి ఉంటూ ఓ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నాం. మాది ఓ మధ్యతరగతి కుటుంబం. తరతరాలుగా మేము శ్రీవారి భక్తులం. మా గృహంలో శ్రీవెంకటేశ్వర సుప్రభాతం, మంగళాశాసనం, శ్రీవేంకటేశ్వరగద్యం వీటి పఠనం నిత్యం జరుగుతుంది. ప్రతి మంగళవారం నాడు అష్టోత్తర శతనామార్చన కూడా భక్తితో జరుపబడుతుంది.
మా తాత, తన స్వార్జితంతో 108 స్వర్ణపుష్పాలు చేయించి శ్రీవారికి సమర్పిస్తానని మొక్కుకున్నారు. కానీ కొన్ని పద్మాలు చేయించగానే అస్వస్థతతో కాలం చేశారు. దాంతో ఆ మ్రొక్కు తీర్చుకునే బాధ్యత మా తండ్రిగారు భుజానికెత్తుకుని, మరికొన్ని పుష్పాలు చేయించి, వారు కూడా స్వర్గస్తులయ్యారు. ఇప్పుడా బాధ్యత మా మూడోతరం వారిపై పడింది. ఆ బాధ్యతను ఆనందంగా స్వీకరించి, ఆర్థికంగా అంతంత మాత్రమే స్థోమత గల మేమందరం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, ప్రతి పైసా కూడబెట్టి, ఎన్నో ఏళ్లుగా స్వర్ణకమలాలు తయారు చేయిస్తున్నాము.
ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు గల 108 కమలాలు ఈ మధ్యనే పూర్తయ్యాయి. తమరు దయతో వీటిని స్వీకరించి స్వామివారి కైంకర్యంలో ఏదోవిధంగా వినియోగిస్తే, మన తండ్రి, తాత గార్ల ఆత్మలు శాంతిస్తాయి. మా కుటుంబ సభ్యులందరికీ ఎనలేని ఆనందం చేకూర్చిన వారవుతారు. ఈ విషయం తమతో ప్రత్యక్షంగా విన్నవించు కోవడానికి, 54 మంది సభ్యులు గల మా పరివారమంతా, కాలినడకన బయలు దేరి కొండకు చేరుకున్నాం.”
👉🏻 ఆ మహమ్మదీయ భక్తుడి !
ఆవేదనను, ఆర్తిని ఆసాంతం విన్న బోర్డు సభ్యులకు నోటమాట రాలేదు. మరో రెండేళ్ల తర్వాత జరుగబోయే తి.తి.దే. స్వర్ణోత్సవాలు చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఏ సేవను ప్రవేశపెట్టాలా ! అని తర్జనభర్జన పడుతున్న బోర్డు సభ్యులకు ముస్లిం భక్తుని విన్నపం, వెదకబోయిన తీగ, శ్రీవారి కృపతో కాలికి తగిలినట్లనిపించింది.
అంతే! బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించి, 1984 సంవత్సరంలో జరిగిన స్వర్ణోత్సవాల సందర్భంగా *”అష్టదళ పాద పద్మారాధన”* అనబడే, ప్రతి మంగళవారం జరిగే, నయనా నందకరమైన ఆర్జిత సేవను ప్రవేశపెట్టారు. అప్పటినుండి ఈ సేవ నిరాటంకంగా జరుప బడుతోంది.
👉 పద్మారాధన మహత్యం !
పురాణేతిహాసాల్లో ఉటంకించిన దాని ప్రకారం, గర్భాలయంలో మూలవిరాట్టుకు జరిగే ఈ సేవ అత్యంత మహత్తరమైనది. మన మనస్సనే పద్మాన్ని స్వామివారి పాదపద్మాలకు సమర్పిస్తున్నామనే భావం భక్తులను పరవశింపజేస్తుంది. స్వామివారి పాదాలు, హస్తద్వయం, ముఖము, నేత్రాలు, పద్మంలో ఉన్నటువంటి వక్షస్థల లక్ష్మీ అమ్మవారు సమస్తం పద్మమయమే! వేంకటేశుని ఆ పద్మతత్వం మనలను ధర్మమార్గం వైపు నడిపిస్తుంది. కాబట్టే, ఈ పద్మారాధనకు అంతటి ప్రాముఖ్యం ఉంది.
👉 ఆరాధనా విధానం !

ఉదయం 6 గం. లకు, వైఖానస అర్చకులు గర్భాలయ మూర్తికి ఆర్ఘ్య, పాద్య, ఆచమనాదులు నిర్వహించడంతో ఈ సేవ మొదలవుతుంది. తరువాత, *”శ్రీవేంకటేశాయనమః”* అనే ఉచ్ఛారణతో ప్రారంభమైన అష్టోత్తర శతనామావళి పఠనంతో బాటుగా, శ్రీవారి పాదాలకు, ఒక్కో నామానికి ఒక్కో స్వర్ణపద్మ సమర్పణతో అర్చన కొనసాగుతుంది. శ్రీవారి పాదాల ముందుంచిన ఓ ఐదంచెల వర్తులాకార పీఠంపై ఈ పద్మాలను ఒకటొకటిగా ఉంచుతారు. ఈ 108 నామాలలో శ్రీవారి ఘనతనూ, దివ్యచరితనూ, లీలలనూ, పరాక్రమాన్నీ, అవతార విశేషాలను కొనియాడతారు.
👉 ఐతిహ్యం !
పూర్వయుగాల్లో బ్రహ్మదేవుడు సమస్త దేవగణ సమేతుడై, స్వర్గంలో ప్రవహించే మందాకిని అనబడే గంగానదిలో వికసించే బంగారు పద్మాలతో, స్వామి వారి పాదాలకు అర్చన చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మ స్వయంగా విష్ణువు కుమారుడు. అంటే, ఇది కొడుకు తండ్రికి చేసేటటువంటి పాదపూజ. నాడు బ్రహ్మదేవుడు శ్రీకారం చుట్టిన ఈ సేవ నేటికీ తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రాతఃసంధ్యలో, తల్లి తండ్రుల పాద సేవనంతో దినచర్య ప్రారంభించాలని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వయంగా ఆచరణలో చూపించి, యుగ-యుగాలలో తన సంతతి కంతటికీ మార్గదర్శకు డయ్యాడు.
ఈ సేవలో పాల్గొన్న భక్తులందరికీ, శ్రీవారి కటాక్షంతో, అప్లైశ్వర్యాలు చేకూరడంతో బాటు, వంశాభివృద్ధి కలుగుతుంది టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ప్రకటనలు పేర్కొన్నారు.