విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు చెయ్యండి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేయడానికి అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సంస్కరణల్లో భాగంగా కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


👉 ఇంధన శాఖపై ముఖ్యమంత్రి  జూబ్లీహిల్స్ నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. NPDCL, SPDCL లతో పాటు కొత్తగా మరో డిస్కమ్‌ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్ళు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకురావాలని సూచించారు. దీనికి రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని చెప్పారు.


👉 కొత్త డిస్కమ్ ఏర్పాటు వల్ల ఇపుడున్న డిస్కమ్‌ల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి  అన్నారు. డిస్కమ్‌ల ఆర్ధిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని చెప్పారు.

👉 డిస్కమ్‌ల పునరవ్యవస్తీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని అదేశించారు. 10 శాతం వరకు వడ్డీపై తీసుకున్న రుణాలతో డిస్కమ్‌లు డీలా పడ్డాయని, వాటిని తక్కువ వడ్డీ ఉండేలా రీస్ట్రక్చర్ చేసుకోవాలని ఆదేశించారు.

👉 రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా కలెక్టర్లు అనువైన భవనాలను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని చెప్పారు.

👉 ఆర్ అండ్ బీ శాఖతో సమన్వయం చేసుకుని రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి  చెప్పారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌నకు అనువుగా సోలార్ రూఫ్‌టాప్ షెడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

👉 ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని నిర్దేశించారు. వచ్చే మూడేళ్లలో 2 లక్షల 10 వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలన్న సూచించారు.