ఎలుకలు ఫారెన్ లిక్కర్ తాగాయి !

👉 800 బాటిళ్ల మద్యం మాయం !

J.SURENDER KUMAR,

ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారుల తనిఖీ లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) నిల్వలు కనిపించకుండా పోవడంతో ఎలుకలు ,800 బాటిళ్ల ఫారెన్ లిక్కర్ తాగాయి అంటూ మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు. వారి  సమాధానంతో  అధికారులు ఆశ్చర్యపోయారు.


ఝార్ఖండ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిల్వలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ధన్‌బాద్‌లోని బలియాపూర్, ప్రధాన్ ఖుంటా ప్రాంతాల్లోని దుకాణాలను తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ తనిఖీలో 802 మద్యం బాటిళ్లు మాయమైనట్లు తేలింది.


ఈ తేడా గురించి వ్యాపారులను ప్రశ్నించగా.. వారు ఎలుకలు మద్యం బాటిళ్ల మూతలను కొరికి  తాగేశాయని  అధికారులకు వివరించారు. అయితే ఈ వింత సమాధానానికి అధికారులు వ్యాపారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు మాయమైన మద్యం బాటిళ్లకు సంబంధించి ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని వ్యాపారులను అధికారులు ఆదేశించారు.


అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామలీల రవాణి వ్యాపారుల వాదనపై ఇది పొంతన లేని “చెత్త” అని బదులిచ్చారు. నష్టాలకు పరిహారం చెల్లించమని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తామని అన్నారు
.

ధన్‌బాద్‌లో ఎలుకల పై ఆరోపణలు చేయడం  ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న దాదాపు 10 కిలోల భాంగ్, 9 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కోర్టుకు కూడా వెళ్లింది. అప్పట్లో అధికారులు చెప్పిన నమ్మశక్యం కానీ సమాధానాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఝార్ఖండ్ కొత్త మద్యం పాలసీ కింద సెప్టెంబర్ 1 నుంచి మద్యం దుకాణాల నిర్వహణ ప్రైవేట్ లైసెన్సీలకు మారుతుంది. ఇది రెవెన్యూ వసూళ్లలో పారదర్శకతను పెంచడం, రాష్ట్రంపై పరిపాలనా భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం అమలులోకి రావడానికి ముందే ఇలాంటి వింత సంఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

👉 ( వన్ ఇండియా న్యూస్ సౌజన్యంతో )