అసెంబ్లీకి పోటీ చేసే వయస్సు 21 సంవత్సరాలకు కృషి చేస్తా !

👉 రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించేందుకు తమవంతు కృషి చేస్తామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు.


👉 దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువత చేతుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ  ఓటు హక్కు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, అదే స్ఫూర్తితో చట్ట సభల్లో పోటీ చేయడానికి వయో పరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.


👉  భారతరత్న రాజీవ్ గాంధీ  జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న వారి విగ్రహానికి ముఖ్యమంత్రి బుధవారం పుష్పాంజలి ఘటించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ.. ఈ దేశంలో యువతకు అవకాశాలు కల్పించడానికి రాజీవ్ గాంధీ  అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు.


👉 “చట్ట సభల్లో మహిళలకు సముచితమైన స్థానం కల్పించినప్పుడే సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్న సంకల్పంతో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాది వేశారు. గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ దేశంలో పారదర్శకమైన పరిపాలన, నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరడానికి ప్రభుత్వ నిర్ణయాల్లో సాంకేతిక నైపుణ్యాన్ని జోడించారు.


👉 రాజీవ్ గాంధీ  కంప్యూటర్, టెలికాం రంగాల్లో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణల వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో హైటెక్ సిటీకి వేసిన పునాది రాయి నేపథ్యం నుంచి క్రమేపీ హైదరాబాద్ ఈరోజు ఐటీ కంపెనీలు, డేటా, జీసీసీ సెంటర్లకు కేంద్రంగా, దేశంలోనే మొట్టమొదటి సిటీగా మారింది.


👉  హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ శ్రేణి అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతాం. అమరుడైన రాజీవ్ గాంధీ  స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు పోతుంది. వారిని ఆదర్శంగా తీసుకునే గుండెకాయ లాంటి సచివాలయం ముందు వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాం..” అని ముఖ్యమంత్రి  అన్నారు.


👉 ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.