ఆగష్టు 31న‌ మహతిలో శ్రీ ఆదిభట్ల జ‌యంతి మహోత్సవం!

👉  సెప్టెంబ‌రు 1 నుండి 10వ తేదీ వ‌ర‌కు  హ‌రిక‌థ వైభ‌వం !

J.SURENDER KUMAR,

హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతిని పురస్కరించుకుని ఆగష్టు 31వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జ‌యంతి మహోత్సవం వైభవంగా జరుగనుంది. టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా  సెప్టెంబ‌రు 1 నుండి 10వ తేదీ వ‌ర‌కు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో   హ‌రిక‌థ క‌ళాకారులకు ” హ‌రిక‌థ వైభ‌వం “  పేరిట శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జరుగనుంది. ఈ కార్యక్రమం వారి నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగపడనుంది ఎంపిక చేసిన 180 మంది హరికథకులకు తిరుప‌తి శ్వేత భ‌వనంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక నెలలో 30 మందికి పదిరోజుల చొప్పున 6 నెలల పాటు శిక్షణ జరుగనుంది.  హరికథలో ప్రవేశమున్న వారు వారి నైపుణ్యాలను  మరింతగా మెరుగు పరచుకునేందుకు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్యాల‌యంలో వారి పేర్లను నమోదు చేసుకోవాల‌ని హిందూధర్మ ప్రచార పరిషత్కోరుతోంది.
హరికథ యందు ఇదివరకే ప్రవేశం ఉన్నవారు మాత్రమే నమోదుకు అర్హులు.  శిక్షణ కోసం వచ్చిన కళాకారులకు ఉచిత భోజ‌నం, వ‌స‌తి కల్పిస్తారు.
శిక్ష‌ణ అనంతరం ”హ‌రిక‌థ ప‌త్రం” అందిస్తారు. 

ఇందులో భాగంగా ఆగ‌స్టు 31వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుండి హ‌రిక‌థ ప్రాశ‌స్త్య‌ము, హ‌రిక‌థ – ధ‌ర్మ ప్ర‌చారం, శ్రీ ఆదిభట్ల నారాయణదాసు జీవిత విశేషాలు, ప్ర‌ముఖ కళాకారులతో హరికథాగానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కాగా ఈ నెల 31వ తేదీన ఉదయం 8.30 గంట‌ల‌కు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలోని శ్రీ ఆదిభట్ట నారాయణదాసు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, బృందగానం నిర్వహిస్తారు.

నారాయణదాసవర్యులు 1864, ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించేవారు.

పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించడంలో నారాయణదాసవర్యులు కాళిదాస మహాకవికి సమానమైనవారు. ఈయన సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయం తదితరాలు ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి.

ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.