👉 సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు!
👉 ముగ్గురు నిజామాబాద్, ఒకరు జగిత్యాల, మరొకరు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు !
J.SURENDER KUMAR,
బహరేన్ లో రెండేళ్ళ జైలుశిక్ష విధించబడిన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట అందరు కల్సి ఒక ఉమ్మడి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వద్దకు తీసికెళ్లి సమస్య తీవ్రతను వివరించారు. వారి గోడు విన్న వెంటనే ఆమె సీఎంఓ లో కీలక అధికారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రి దృష్టికి ఈ సమస్యను తీసికెళ్లారు. గల్ఫ్ కుటుంబాల వెంట బొజ్జ అమరేందర్ రెడ్డి, బషీర్ అహ్మద్, మోత్కూరి నవీన్ గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు.
గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ, మార్కెటింగ్, అమ్మకం చేసిన ఆహార భద్రతా కేసులో… ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంఘటన ఇటీవల బహరేన్ లో జరిగింది.
వీరిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిడి లింబాద్రి (డిచుపల్లి), కర్రోల్ల లక్ష్మినర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్ పల్లి), జగిత్యాల జిల్లాకు చెందిన గోవింద్ రాకేష్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటు బాబు (కొండాపూర్) అనే ఐదుగురు యువకులు ఉన్నారు.
గోదాములో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం, చేసేపని మంచో… చెడో అవగాహన లేకపోవడం ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని వారు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాలని కోరారు.
బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీ ద్వారా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
యజమాని ఒత్తిడి వలన అమాయకులైన కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి ‘క్షమాబిక్ష’ లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు నకిడి గంగామణి (డిచుపల్లి), కర్రోల్ల సరస్వతి (మల్లారం), తిమ్మజడ నర్సవ్వ (తిర్మన్ పల్లి), గోవింద్ విజయ (రత్నాపూర్), బట్టు స్నేహ (కొండాపూర్) లు కోరుతున్నారు.