బహరేన్ లో ఐదుగురు తెలంగాణ వాసులకు జైలుశిక్ష !

👉 ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసు !

👉 ఇద్దరు కంపెనీ యజమానులు, ఒక మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష !

👉 మొత్తం 19 మంది కార్మికులకు జైలు శిక్ష  వీరిలో 5 గురు తెలంగాణ వాసులు !

👉 ఇద్దరు యజమానులకు ఒక లక్ష దీనార్ల చొప్పున  (₹2.3 కోట్లు) భారీ జరిమాన !

J SURENDER KUMAR,

బహరేన్ దేశంలో గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ చేయడం, మార్కెటింగ్ చేసిన అతిపెద్ద ఆహార భద్రతా కేసులో, ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయాన్ని బహరేన్ మీడియా ఆగస్టు 20న  వెల్లడించింది.


ప్రవాసీయుల శిక్షాకాలం పూర్తయిన తర్వాత ‘డిపోర్ట్’ (దేశ బహిష్కరణ – స్వదేశానికి పంపడం) చేస్తారు. ఇందులో 5గురు తెలంగాణ కార్మికులున్నట్లు బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ వెల్లడించారు.

ఈ కేసులో రెండేళ్ల శిక్ష పడిన, రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన బంటు బాబు (32) అనే గల్ఫ్ కార్మికుడి ఉన్నాడు.


బంటు బాబు మేనమామ గాదం ప్రభాకర్ సహాయం కోసం… తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డిని, సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అవివాహితుడైన బాబు గత ఏడేళ్ళుగా ఏకధాటిగా బహరేన్ లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేరు. పెళ్లయిన ఒక చెల్లెలు ఉన్నారు
.

మే 15 నుంచి తనను ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని, అల్ దాయ్సి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యానికి బంటు బాబు మార్చి 2న దరఖాస్తు చేసుకున్నాడు. ఇండియాకు రావాల్సిన అతను అనుకోకుండా ఈ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు.

👉 చెప్పిన డ్యూటీ చేయడం 19 మంది పాలిట శాపం !

గల్ఫ్ తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లిన ఏదేశ పౌరులైనా స్థానిక ఆచార, వ్యవహారాలను అక్కడి సివిల్, క్రిమినల్, కార్మిక చట్టాలను (లా ఆఫ్ ది ల్యాండ్) గౌరవించాలి, పాటించాలి. గోదాములో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది.

యాజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం, చేసేపని మంచో… చెడో అవగాహన లేకపోవడం 19 మంది ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని తెలంగాణ ‘గల్ఫ్ కాంగ్రేస్’ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందించాలని ఆయన కోరారు. 

యజమాని ఒత్తిడి వలన అమాయకులైన కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి ‘క్షమాబిక్ష’ లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.