ఈ బ్లడ్ గ్రూప్ భారత్‌లో తప్ప  ఎక్కడా లేదు !

J.SURENDER KUMAR,

ఎ, బి, ఓ, ఆర్‌హెచ్ వంటి బ్లడ్ గ్రూపుల గురించి విని ఉంటారు. ఇవే కాకుండా, కొన్ని అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త బ్లడ్ గ్రూప్‌ను గుర్తించారు. దాని పేరు ‘సీఆర్‌ఐబీ’.

సీఆర్‌ఐబీ (CRIB)లో సీఆర్ అంటే క్రోమర్ అని అర్థం. ఇది 47 బ్లడ్ గ్రూప్‌ల్లో ఒకటి. ఐ అంటే ఇండియా, బీ అంటే బెంగళూరు అని అర్థం. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది బెంగళూరు సమీపంలో ఒక మహిళలో గుర్తించిన కొత్త బ్లడ్ గ్రూప్ ఇది అత్యంత అరుదైనది.

👉 మామూలుగా గుండె శస్త్రచికిత్స సమయంలో ట్రాన్స్‌ఫ్యూజన్ (రక్త మార్పిడి) కోసం ఒకటి లేదా రెండు సీసాల రక్తాన్ని వైద్యులు ముందే సిద్ధం చేసుకుంటారు. ఇలా చేయడం అవసరం. కానీ, ఈ 38 ఏళ్ల మహిళకు గుండె శస్త్రచికిత్స సమయంలో ఈ ప్రక్రియను వైద్యులు అనుసరించలేకపోయారు. ఎందుకంటే అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో ఆ మహిళకు సరిపోలే రక్తం వైద్యులకు దొరకలేదు. ఇది జరిగిన 11 నెలల తర్వాత, డాక్టర్ అంకిత్ మాథుర్ ఆపరేషన్ జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అదనపు రక్తం ఎక్కించే అవసరం రాకుండానే ఆమె ఆపరేషన్ పూర్తయిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

👉 బెంగళూరులోని రోటరీ-టీటీకే బ్లడ్ సెంటర్ అడిషనల్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకిత్ మాథుర్ పని చేస్తున్నారు. కోలార్‌లోని ఆర్‌ఎల్ జలప్పా ఆసుపత్రి వైద్యులకు డాక్టర్ అంకిత్ మాథుర్ ఒక ముఖ్యమైన అడ్వైజర్‌ కూడా. గుండె సమస్యకు ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవాలని ఆ మహిళకు సలహా ఇచ్చారు.


👉 బీబీసీతో డాక్టర్ అంకిత్ మాథుర్ మాట్లాడుతూ..

ఆ మహిళ రక్తం ఏ ఇతర బ్లడ్ గ్రూప్‌తోనూ సరిపోలలేదని, ఆ తర్వాత మేం వారి కుటుంబంలోని 20 మంది సభ్యుల రక్త నమూనాలను సేకరించాం. ఎవరి రక్తం కూడా ఆమె రక్తంతో సరిపోలలేదు” అని ఆయన చెప్పారు.ఇక చివరి మార్గంగా ఆమె రక్త నమూనాను యూకేలోని బ్రిస్టల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రెఫరెన్స్ లేబొరేటరీ (ఐబీఆర్‌జీఎల్)కు పంపించామని తెలిపారు. ”ఆ రక్త నమూనాల పూర్తి విశ్లేషణకు వారికి 10 నెలలు పట్టింది. ఫిబ్రవరి-మార్చిలో వారు తమ నివేదికను పంపారు. రోగి రక్తంలో ప్రత్యేకమైన యాంటీజెన్ ఉందని ఆ నివేదికలో వారు పేర్కొన్నారు.


👉 ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్‌బీటీ)కి పంపించారు. అక్కడ రెడ్ బ్లడ్ సెల్ ఇమ్యునోజెనెటిక్స్ అండ్ టెర్మినాలజీ గ్రూప్ నిపుణులు ఉంటారు. వారే దీనికి ‘సీఆర్‌ఐబీ’ అనే పేరు పెట్టారు” అని ఆయన వివరించారు. ఈ ఏడాది జూన్‌లో ఇటలీలోని మిలన్‌లో జరిగిన ఐఎస్‌బీటీ 35వ సదస్సులో దీన్ని అధికారికంగా ప్రకటించారు.

👉 అరుదైన జన్యువులు !

ఒక వ్యక్తి బ్లడ్ గ్రూప్ అనేది తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ మహిళ విషయంలో జన్యు నిర్మాణంలో ఏదైనా సమస్య ఉందా? వారి కుటుంబంలోని ఒకరిలోనైనా ఈ యాంటీజెన్ ఉంటుందని భావించామని, అయితే ఎవరిలోనూ ఇది లభ్యం కాలేదని డాక్టర్ మాథుర్ వివరించారు. యాంటీజెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇవి శరీరంలో అన్నిచోట్లా ఉంటాయి.
”శరీరంలో ఏదీ ఏర్పడినా దాని పూర్తి సమాచారం లేదా కోడింగ్ అనేది తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తుంది.

👉 తల్లి జన్యువుల నుంచి సగం, తండ్రి జన్యువుల నుంచి సగం సంక్రమిస్తాయి. తండ్రి నుంచి వచ్చే జన్యువుల్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని తల్లి జన్యువులు పూరిస్తాయి. అలాగే తల్లి జన్యువుల్లో ఏవైనా లోపం ఉంటే తండ్రి జన్యువులు వాటిని పూరిస్తాయి. కానీ, ఈ మహిళ కేసులో కేవలం సగం సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే, ఆమె బ్లడ్ గ్రూప్ పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ కేసులో దీన్ని క్రోమర్ యాంటీజెన్‌గా చెప్పొచ్చు. ఇప్పటివరకు, క్రోమర్ బ్లడ్ గ్రూప్ వ్యవస్థలో 20 యాంటిజెన్‌లను గుర్తించారు. సీఆర్‌ఐబీ ఇప్పుడు ఈ వ్యవస్థలో 21వ యాంటిజెన్‌గా మారింది” అని ఆయన వివరించారు.

👉 ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే !

ఎలాంటి అత్యవసర పరిస్థితి అయినా ఇలాంటి రోగులకు సేఫ్ కాదు. వీరికి సాధారణ పద్ధతిలో రక్తం ఎక్కిస్తే, వారి శరీరం దాన్ని బయటి పదార్థంగా భావించి, నాశనం చేయడానికి యాంటీబాడీలను సృష్టిస్తుంది. సదరు రోగి కుటుంబంలోనే సీఆర్‌ఐబీ టైప్ బ్లడ్ గ్రూప్ఉన్న వ్యక్తులు దొరికేంతవరకు, ఇలాంటి కేసుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉండవని డాక్టర్ మాథుర్ చెప్పారు.

👉”ఇలాంటి కేసుల్లో ఉన్న మార్గం ఏంటంటే, సర్జరీకి ముందు ఆ రోగి నుంచే రక్తాన్ని సేకరించడం. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో రోగికి వారి సొంత రక్తాన్ని ఎక్కించడం. దీన్నే ఆటోలోగస్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అని అంటారు” అని ఆయన వివరించారు.

👉 ఇతర బ్లడ్‌గ్రూప్‌లకు రక్తం ఇవ్వొచ్చా ?

సీఆర్‌ఐబీ బ్లడ్ గ్రూప్ అనేది మిగతా 47 బ్లడ్ గ్రూప్ వ్యవస్థల కంటే భిన్నం కాదు. ఇందులోనూ 300 యాంటీజెన్‌లు ఉంటాయి. కానీ, ఏబీఓ, ఆర్‌హెచ్‌డీ బ్లడ్ గ్రూప్‌ల విషయంలోనే ట్రాన్స్‌ఫ్యూజన్ కోసం సరిపోల్చుతుంటారు. కోలార్ మహిళా రోగి కూడా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారి తరహాలోనే తన రక్తాన్ని ఇతరులకు ఇవ్వగలదు. కానీ, ఇతరుల రక్తాన్ని తాను తీసుకోలేదు” అని డాక్టర్ అంకిత్ మాథుర్ తెలిపారు.

👉 ముంబయిలోని ఐసీఎంఆర్-ఎన్‌ఐఐహెచ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డాక్టర్ స్వాతి కులకర్ణి ఈ విషయం గురించి బీబీసీతో మాట్లాడారు.

బాంబే ఫోనోటైప్ (అనువంశిక లక్షణాలు) ఉన్నవారిలో, ‘ఓ’ బ్లడ్ గ్రూప్ తరహాలోనే ఎ, బి యాంటీజెన్‌లు ఉండవు. కానీ, వారు ‘ఓ’ బ్లడ్ గ్రూప్‌ను తీసుకోలేరు” అని స్వాతి వివరించారు.
జాతీయ స్థాయిలో అరుదైన రక్తదాతల రిజిస్టర్‌ ఒకదానిని తయారు చేయడానికి ఎన్‌ఐఐహెచ్ ప్రయత్నిస్తోందని డాక్టర్ స్వాతి కులకర్ణి చెప్పారు.

         ( బీబీసీ న్యూస్ సౌజన్యంతో )