👉 పోచారం ప్రాజెక్టు పొంచి ఉన్న ప్రమాదం ?
J.SURENDER KUMAR,
కురుస్తున్న కుంభవృష్టి భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలం అవుతోంది. వర్ష బీభత్సానికి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్ ప్రమాదం అంచుకు చేరింది. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో పది అడుగుల ఎత్తులో మత్తడి పైనుండి నీరు పారుతుంది. భారీ వర్షాలకు గంటగంటకూ వరద తాకిడి స్థాయికి మించి ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మట్టి కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఏ క్షణమైనా పోచారం ప్రాజెక్ట్ కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

👉 ప్రాథమికంగా నష్టం అంచనా !
భారీ వర్షాల కారణంగా పెద్దా చెరువు ఉప్పొంగి, హౌసింగ్ బోర్డు కాలనీతో సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
👉 రైల్వే ట్రాక్ ధ్వంసం:
కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే ట్రాక్ వరదలో కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
👉 వాహనాలు కొట్టుకుపోయాయి:
హౌసింగ్ బోర్డు కాలనీలో వరద ఉధృతికి 15 కార్లు, 12 బైక్‌లు కొట్టుకుపోయాయి.
👉 ప్రజలు చిక్కుకుపోయారు:
హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 50 మంది నివాసితులు ఇళ్లలోనే చిక్కుకుపోయారు.
👉 రహదారులు మూసివేత:
వరదల తీవ్రత ఎక్కువగా ఉన్నందున కామారెడ్డి-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిని మూసివేశారు.
👉 పంట నష్టం:
వేలాది ఎకరాల్లో వరి, పత్తి వంటి పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు.
👉 గ్రామాలు నీట మునిగాయి:
మంజీర నది ఉప్పొంగడం వల్ల పరివాహక ప్రాంతంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి.
రాబోయే 12 గంటలపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తోడు వాగులు, కాలువల దరిదాపుల్లోకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో చాటింపు కూడా వేస్తున్నారు. ప్రమాదంలో బీబీపేట పెద్ద చెరువు ఉంది. చెరువు కట్టపై నుంచి వరద నీరు పారుతుంది. చెరువు కట్ట తెగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నిజాంపేట మండలంలో రాంపూర్, నందగోకులం గ్రామాలకు ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మెదక్ జిల్లాలోనూ భారీగా వర్షం నమోదవుతోంది. ఏక ధాటిగా కురుస్తోన్న కుండపోత వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ధూప్ సింగ్ తండా నీట మునిగింది. ప్రజలు ఇళ్లపైకి చేరి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం నమోదవుతోంది. రాజంపేటలో అత్యధికంగా 32 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాలకు కామారెడ్డి – నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అటు హైదరాబాద్ – నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీలో భారీగా వరదనీరు చేరింది. దీంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.