👉 మంత్రిని గజమాలతో సన్మానించిన ఉద్యోగులు !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో దివ్యాంగ ఉద్యోగులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆదివారం కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సాధారణ బదిలీలు మరియు నియామకాల నుండి మినహాయింపు కల్పించే జి.ఓ.34 జారీ చేసినందుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సన్మానించి మిఠాయి తినిపించి, అభినందనలు తెలిపారు.

👉 దివ్యాంగ ఉద్యోగుల పాలిట వరం జీవో 34 !
తెలంగాణ ప్రభుత్వం 2025 ఆగస్టు 7 న జీవో 34 దివ్యాంగ ఉద్యోగుల పాలిట వరం అయ్యింది. ఈ ప్రభుత్వ జీవో ఉత్తర్వుల ప్రకారం తీవ్ర వైకల్యం కలిగిన ఉద్యోగులు ఇకపై సాధారణ బదిలీల నుండి మినహాయింపును పొందుతారు.
👉 వివరాల్లోకి వెళితే…
2016లో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారత చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులోని అంశాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు, దివ్యాంగ పిల్లలు ఉన్న తల్లిదండులకు జీవో 34 ద్వారా కింది సౌకర్యాలను అందించింది.

👉 70% లేదా అంతకంటే ఎక్కువ శాతం వికలాంగత ఉన్న ఉద్యోగులు – ప్రస్తుత పోస్టులో కొనసాగే అవకాశముంది (బదిలీ అవసరం లేదు).
👉 మానసిక వికలాంగత కలిగిన పిల్లల తల్లిదండ్రులుగా ఉన్న ఉద్యోగులు – వారి అభిరుచికి అనుగుణంగా అదే పోస్టులో కొనసాగే వీలుంది.
👉 70% కంటే ఎక్కువ శాతం వికలాంగత ఉన్న కుటుంబ సభ్యులను (డిపెండెంట్లు) చూసుకునే ఉద్యోగులు (తల్లిదండ్రులు/పిల్లలు/జీవిత భాగస్వామి/సోదరులు/సోదరీమణులు) – బదిలీ మినహాయింపు పొందుతారు.
👉 సాధారణంగా శారీరక వైకల్యం కలిగిన వారు తమకు కావలసిన భౌతిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ఉద్యోగం చేసే ప్రదేశానికి అలవాటు పడతారు.
👉 సాధారణ బదిలీలు జరిగినప్పుడల్లా వీరు మానసిక ఆందోళనకు గురికావడం, అదేవిధంగా నూతన పని ప్రదేశానికి అలవాటుకాక ఇబ్బందులు పడవలసి వచ్చేది. అంతేకాకుండా తమకు అనుకూలమైన వైద్య సదుపాయం ఉన్న ప్రదేశాల్లో ఇకపై శాశ్వతంగా ఉద్యోగం చేయవచ్చు.

👉 ఎన్నో ఏళ్ళుగా దివ్యాంగ ఉద్యోగులు ఎదురు చూస్తున్న జీవో విడుదలకు కృషి చేసిన దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు దివ్యాంగ ఉద్యోగులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు