ముగ్గురు కీలక సైబర్ మోసగాళ్లు అరెస్ట్ !

👉 పక్కాగా రిక్కి నిర్వహించి అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు

J.SURENDER KUMAR,

సైబర్ మోసానికి పాల్పడిన ముగ్గురు కీలక నిందితులను  జగిత్యాల పోలీసులు ఇతర రాష్ట్రంలో పక్కాగా రిక్కీ నిర్వహించి ముగ్గురు మోసగాళ్లను గురువారం అరెస్టు చేశారు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

కోరుట్లకు చెందిన ఒకరి నుంచి ₹.53 లక్షలు, జగిత్యాలకు చెందిన మరో వ్యక్తి నుంచి ₹.21 లక్షలు కాజేశారు. బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్, ఆదేశాల మేరకు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

జిల్లా సైబర్ క్రైం డీఎస్పీ ఎం. వెంకటరమణ నాయకత్వంలో  ఏర్పాటైన బృందంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు,బుగ్గారం ఎస్సై సతీశ్, సైబర్ క్రైం ఎస్సైలు క్రిష్ణ, దినేష్ కుమార్ సభ్యులు.

కర్ణాటకలోని బెంగళూరులో సైబర్ మోసగాళ్లు ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. అక్కడి శ్రీనివాసపురం ఎలహంకకు చెందిన నాగేంద్రప్రసాద్ , కలకత్తాలోని అన్వర్ సూచనలతో బిజి నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసగించి వచ్చిన డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు.

అతడిపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ం రిపోర్టింగ్ పోర్టల్) లో 71 కేసులు నమోదై ఉన్నాయి. అతని నుంచి బ్యాంకు ఖాతాలు, చెక్ బుక్కులు, మొబైల్ ఫోన్లు ప్రత్యేక బృందం స్వాధీనం చేసు కున్నారు.

ఉత్తర బెంగుళూరు దశరథాలి ప్రాంతానికి చెందిన యోగేష్, మైసూర్ కు చెందిన సునీల్, మరి కొందరు ఇతరుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుంటారు. అలా వచ్చిన డబ్బులు జల్సాలకు ఉపయోగించుకునే వారు.

వీరిద్దరిపై ఎన్సీఆర్పీ పోర్టల్ లో 22 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో ముగ్గురు సైబర్ నేరగాళ్లను  అరెస్టు చేసి రిమాండ్ కు  పంపించినట్లు ప్రత్యేక బృందం అధికారి డీఎస్పీ ఎం.వెంకటరమణ తెలిపారు.