👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
👉 గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.

👉 గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
👉 ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు పరిశ్రమలు, మున్సిపల్ – పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, ఎంఆర్‌డీసీఎల్ ఉన్నతాధికారులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.