ప్రతి అర్జీదారుని పట్ల మానవీయ కోణంలో స్పందిస్తాం !

👉 కలెక్టరేటులో దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లారని వస్తున్న వార్తపై …

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్ స్పందన !

J SURENDER KUMAR,

ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడు, వృద్ధులు దివ్యాంగుల విషయంలో మానవీయ కోణంలో స్పందిస్తున్నామని, ప్రతి దరఖాస్తుదారు సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు.


👉 సోమవారం (11.08.2025న)  ప్రజావాణిలో ప్రజలందరి నుండి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మర్రిపెల్లి రాజ గంగారాం S/o రాజం ప్రజావాణికి వచ్చారు. తనకు 2014లో నల్ల కనెక్షన్ మంజూరైందని, స్థానిక వ్యక్తి అభ్యంతరం కారణంగా కనెక్షన్ ఏర్పాటు కాలేదని దరఖాస్తు చేశారు.

👉 ఈ సమస్యపై అధికారులు విచారించగా పిటిషనర్ రాజ గంగారం, ఇంటికి ముందు, వెనుక రెండు అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. ఇంటికి ముందు గల రోడ్డు పంచాయతీరాజ్ శాఖకు చెందినది. వెనుక అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న గృహయజమానులకు (ప్రైవేట్ ఆస్తి) సంబంధించినది. వారందరూ దరఖాస్తుదారుని బంధువులు అని తేలింది.

👉 పంచాయత్ రాజ్ రోడ్డు నుండి నల్ల (TAP) కనెక్షన్ లైన్ అందుబాటులో ఉంది. ఈ లైన్ నుండి నల్ల కనెక్షన్ ఇస్తామని రాజా గంగారాంకు పదేపదే వివరించినట్టు సంబంధిత పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

👉  కానీ పంచాయతీ రోడ్డు నుండి  నల్ల కనెక్షన్‌ తీసుకునేందుకు పిటిషనర్ రాజ గంగారం ఇష్టపడటం లేదు.  ఇంటి వెనుక వైపు నుండి అనగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన స్థలం నుండి కనెక్షన్‌ను కోరుతున్నారు.

👉 ఈ విషయంలో ప్రజావాణి సమయంలో దరఖాస్తుదారుడి పిటిషన్‌ను స్వీకరించడం జరిగింది.
సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరిస్తారని ఆయనకు తెలిపారు.

👉 అధికారులు సర్ది చెప్పినప్పటికి వినకుండా తన పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఇక్కడి నుండి కదలనని చెప్పి నేలపై కూర్చొని ఉన్నాడు.

👉 దాదాపు 30 నుండి 45 నిమిషాలు అతను నేలపై కూర్చున్నాడు. ఆ తర్వాత అతన్ని ఒక వైపు కూర్చోమని  అధికారులు అభ్యర్థించారు. కానీ అతను కదలడానికి ఇష్టపడలేదు.

👉 ఈ క్రమంలో ప్రజావాణి లో ఇతర దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా రాజ గంగారామ్ ను పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటనపై విచారణ జరిపి సంబంధిత కానిస్టేబుల్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.

👉 ఈ సంఘటన తర్వాత స్వయంగా నేను (జిల్లా కలెక్టర్) సంబంధిత వ్యక్తి రాజా గంగారాం భార్యతో మాట్లాడాను. అదేవిధంగా RDO ఆమె ఇంటికి వెళ్లి (2) రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగినది.

👉 వాస్తవాలు ఇవి అని ఇందులో ఎటువంటి వివాదాలకూ తావు లేదని, పిటిషనర్ల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు.