సౌమ్యుడు మితభాషి మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


సౌమ్యుడు, మితభాషి ప్రజలతో వారికున్న సత్సంబంధాల వల్లే మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు వారి మరణం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల శాసనసభ శనివారం తీవ్ర సంతాపం ప్రకటించింది.


మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతూ, ప్రజలకు వారందించిన సేవలు, వారితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని స్మరించుకున్నారు.

👉 దివంగత మాగంటి గోపీనాథ్ ప్రజలతో వారికున్న సత్సంబంధాల వల్లే మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 నేను రెండోసారి ఎమ్మెల్యేగా, మాగంటి  తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో శాసనసభలో వారితో కలిసి పని చేశాం. రాజకీయ విధానాల్లో మార్పు వచ్చినప్పటికీ వ్యక్తిగత మిత్రుత్వం, వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు.

👉 విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1983 లో ఎన్ టీ రామారావు  ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. 1985 నుంచి 95 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీఆర్ కు విశ్వాస పాత్రుడిగా పనిచేశారు.

👉 హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యుడిగా, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా సేవలు అందించడమే కాకుండా, సినీ నిర్మాతగా కూడా రాణించారు. 2014, 2018, 2023 మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన అతి తక్కువ మంది శాసనసభ్యుల్లో గోపీనాథ్  ఒకరు.

👉 జూన్ 8 న గోపీనాథ్ గారి అకాల మరణం వారి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. నగర ప్రజలకు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు తీరని లోటు. శాసనసభ వారి కుటుంబానికి అండగా నిలబడుతుంది. గోపీనాథ్  ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం..” అని ముఖ్యమంత్రి  సంతాప తీర్మానంలో పేర్కొన్నారు.