శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు శ్రీ వేటూరి!

👉 75వ వర్ధంతి సందర్భంగా నివాళులు !


J SURENDER KUMAR,

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ మేడసాని మోహన్ పేర్కొన్నారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సులో తిరుపతికి చెందిన శ్రీ చెన్నకేశవులు నాయుడు “శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి స్మారిక – సమీక్ష” అనే అంశంపై ప్రసంగిస్తూ, తిరుమల శ్రీ‌వారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనలను అనువదించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత శ్రీ వేటూరివారిదేనని అన్నారు. ఉన్నత సాహిత్య విలువలు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన కీర్తి వారికి దక్కుతుందని చెప్పారు. పద్య సాహిత్యంతో పాటు కథలు, కథానికలు కూడా రచించినట్లు వివరించారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రభాకర్ మాట్లాడుతూ “శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధన” అంశంపై ప్రసంగించారు. ఆంధ్ర వాంగ్మయ విస్తృతికి వేటూరి వారు చేసిన కృషి అపారమని, గ్రంథ విమర్శనలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరని అన్నారు. తాను రచించిన “శ్రీ ప్రభాకర అష్టకం”లో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించానని, విద్యార్థులు దీన్ని చదవాలని సూచించారు. వేటూరి వారు రచించిన 58 గ్రంథాలు లభించాయని, ఇంకా కొన్ని లభించాల్సి ఉందని తెలిపారు. వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

ప్రముఖ సాహితీవేత్త  వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతిని పురస్కరించుకుని, తిరుపతిలోని టీటీడీ శ్వేత భవనం ఎదురుగా గల ఆయన కాంస్య విగ్రహానికి శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి  మేడసాని మోహన్, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి  రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకురాలు శ్రీమతి లతతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.