👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలపై గురువారం ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు.
వరద ప్రాంతాల పరిశీలన అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.
👉 నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి హెలికాప్టర్‌లో తొలుత ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుని అక్కడ వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
👉 అనంతరం పోచారం ప్రాజెక్టు, పరీవాహక ప్రాంతంతో పాటు హెలికాప్టర్ ద్వారా కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద తీవ్రత దృష్ట్యా ఆ జిల్లాలో జరిగిన నష్టం, తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది.
👉 దాంతో అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లాలో వరద ప్రాంతాలను పరిశీలించారు. మెదక్ చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

👉 ఆయా ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రతను, తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
👉 కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీల తో పాటు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో పరిస్థితులను సమీక్షించారు.