కోవర్ట్ తో మావోయిస్టు కోటలు కూలుతున్నాయి !

👉 కరీంనగర్ జిల్లాలోనే మొదటీ కోవర్ట్ ఆపరేషన్ కు శ్రీకారం !

J SURENDER KUMAR,

దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమ కోటలకు 

కోవర్ట్ ఆపరేషన్ లతో బీటలు పడుతున్నాయి.

నక్సలైట్ ఉద్యమాన్ని నియంత్రించడానికి

దాదాపు రెండు దశాబ్దాల క్రితమే

కరీంనగర్ పోలీసులు

కోవర్ట్  ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు.

దాదాపు ఐదు దశాబ్దాలలో  పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెంది  దాదాపు 14 రాష్ట్రాలలో ఎలా విస్తరించిందో, అదే తరహాలో నక్సల్స్ అగ్ర నాయకులు టార్గెట్ గా పోలీస్ యంత్రాంగం కోవర్టు ప్రక్రియకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. దండకారణ్యంలో భద్రతా దళాలకు ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తో పాటు పలు ఎన్కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు హతమవడంతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో అల్లకల్లోలం మొదలైనట్టు సమాచారం.

సోమవారం చత్తీస్గడ్  నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో  హతమైన ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కడారి సత్యనారాయణ రెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి లను భద్రతా దళాల కోవర్ట్ ఆపరేషన్ తోనే హతమార్చారు అని పౌర  హక్కుల సంఘ నేతలు అభిప్రాయపడుతున్నారు.

👉 అగ్ర నాయకులకు, కోవర్ట్ ఆపరేషన్లకు జిల్లా ప్రయోగశాల !

కోవర్ట్ అంటే, ప్రత్యర్థి శత్రుపక్షంలో ఒకరిని తమ వాడిగా చేసుకుని, వారి రహస్య స్థావరాలు, కదలికల సమాచారం సేకరించి ప్రత్యర్థి పై విజయం సాధించడానికి ప్రణాళికనే కోవర్ట్.

కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం దాదాపు రెండు దశాబ్దాల క్రితమే  హుస్నాబాద్ ప్రాంత వార్ దళ సభ్యుడు, కత్తుల సమ్మయ్య , తో పక్కాగా కోవర్ట్ ఆపరేషన్ చేపట్టి   దళ నాయకుడు భూపతి తో పాటు, దళ సభ్యులను హతమార్చారు. 

వారి ఆయుధాలతో దళ సభ్యుడు కత్తుల సమ్మయ్య, నాటి జిల్లా ఎస్పీ తుషార్ ఆదిత్య త్రిపాఠి, ముందు లొంగిపోయాడు. దీంతో ఈ కోవర్ట్ ఆపరేషన్ ప్రక్రియ మొదటిసారి వేలుగు చూసింది.  అనంతరం కోవర్ట్ కత్తుల సమ్మయ్య, శ్రీలంక విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.

బీర్పూర్ లో వార్ సానుభూతిపరుడుగా,(మిలిటెంట్) ఉంటూ కోవర్ట్ కు  పాల్పడుతున్నాడని బసవరాజు అంజయ్య ను  ప్రజా కోర్టులో నక్సల్స్ కాల్చి చంపారు.


వార్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న విజయ్, రామగిరి గుట్టలలో కోవర్ట్ ఆపరేషన్ లో హతమయ్యాడు. దీనికి సూత్రధారి, పాత్రధారి దళ సభ్యుడు జడలు నాగరాజు అంటూ వార్ దళం నాగరాజును వెంటాడింది. మంథని డివిజన్ లో నాగరాజు ఆచూకీ కోసం  అతని సమీప బంధువు, పాత్రికేయుడు రమేష్ ను ఇంటిని వార్ చుట్టుముట్టింది. త్రుటిలో తప్పించుకున్న రమేష్ వెంటపడి వార్ కాల్పులు జరిపింది. ప్రాణాలతో రమేష్ బయటపడ్డాడు. హుజురాబాద్ డివిజన్ ఎల్కతుర్తి గ్రామానికి చెందిన పాత్రికేయుడిని పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ప్రజా కోర్టులో హింసించారు.


👉 కొయ్యూరు ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు హతం !


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా  మల్హర్‌ మండలం కొయ్యూరులో 1999 డిసెంబరు 2న  ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతో్‌షరెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి శీలం నరేష్‌ మృతి చెందారు. 

వారి స్మారకార్థం  2000వ సంవత్సరం డిసెంబరు 2న పీపుల్స్‌వార్‌ గ్రూపు పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) ని ఏర్పాటు చేసింది. ఈ  ఎన్ కౌంటర్ పై వార్ అగ్రనాయకత్వంలో నెలకొన్న  విభేదాలతో అనే చర్చ  విస్తృతంగా జరిగింది.

👉 ద్రోహి గోవిందరెడ్డి  సమాచారంతోనే ఎన్కౌంటర్.. గణపతి ప్రకటన !

వార్ అగ్రనాయకత్వం పై ఆరోపణలు రావడంతో స్వయాన నాటి కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు, @ గణపతి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి దహన సంస్కారాల స్మశాన వాటిక వద్ద, గణపతి విడుదల చేసిన పత్రికా ప్రకటన సారాంశాన్ని పౌర హక్కుల సంఘ కీలక నాయకుడు వేలాదిమంది సమక్షంలో చదివి వినిపించాడు.

” ఖమ్మం ప్రాంతానికి చెందిన గోవిందరెడ్డి  బెంగళూరులో డెన్ ఇంచార్జ్ గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆ ద్రోహి పోలీసులకు కోవర్ట్  గా మారి ఇచ్చిన సమాచారంతోనే  కొయ్యూరు ఎన్కౌంటర్ లో అగ్ర నాయకులను కోల్పోయాము అంటూ తదితర సంఘటనలు పేర్కొంటూ గణపతి ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.

👉 కోవర్ట్ లు, ఇన్ఫార్మర్ల ఏరివేతకు ఉత్తర తెలంగాణ వార్ కార్యదర్శి పద్మక్క @  రజిత,  స్పెషల్ ఆపరేషన్ !

ఉమ్మడి జిల్లాలో కోవర్ట్ లు, పోలీస్ ఇన్ ఫార్మర్లతో పీపుల్స్ వార్ ఉనికికే ప్రమాదంగా ఏర్పడిందని అప్పటి ఉత్తర తెలంగాణ కార్యదర్శి పద్మక్క వీరిని గుర్తించి, ఏరివేతకు ఆపరేషన్ మొదలు పెట్టింది. ఆయా దళానాయకుల ద్వారా గ్రామాల్లో అనుమానిత దళ సభ్యుల, ఇన్ఫార్మర్ల  సమాచారం, సేకరించి 2021 జులై మాసంలో ఒకే రోజున జిల్లాలోని వివిధ గ్రామాల నుండి 13 మందిని  కిడ్నాప్ చేసింది. 

దాదాపు 9 రోజులపాటు వివిధ గ్రామాల పరిసర ప్రాంతాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేస్తూ ఓ ప్రాంత దళంలో సభ్యుడికి, పద్మక్క కిడ్నాప్ చేసి ఆధీనంలో ఉన్న ఒకరితో దళ సభ్యుడి సంబంధం గుర్తించారు. ప్రజా కోర్టు నిర్వహించి జగిత్యాల డివిజన్ అటవీ ప్రాంతంలో ఉదయ్ అనే దళ సభ్యుడిని హతమార్చింది.

వీరితో మరో ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించిన పద్మక్క కిడ్నాప్ అయినవారిలో  ఒకరు  వెల్గటూరు మండలానికి చెందిన,  చింతల మొగిలిని ( బీర్పూర్ ఇతడి అమ్మమ్మ గ్రామం) కాల్చి చంపారు.  రేచపల్లి కి చెందిన సురేందర్ అనే యువకుడి చేతి వేళ్లను కత్తిరించారు.

తమ అదుపులో ఉన్న  మిగతా అనుమానితులను, ఆయా దళ సభ్యులను, కోవర్ట్, ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తే ఇదే శిక్ష అంటూ హెచ్చరించి విడిచిపెట్టింది. పద్మక్క విధించిన శిక్ష తీరును వారు గ్రామాలలో ప్రచారం చేశారు.  పద్మక్క చెర నుండి విడుదలైన వారిలో బీర్పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉన్నాడు ( ప్రస్తుతం పాత్రికేయుడిగా కొనసాగుతున్నాడు)

👉 పద్మక్క టార్గెట్ గా కోవర్ట్.. ?

పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా ఉత్తర తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్మక్క టార్గెట్ గా పోలీస్ యంత్రాంగం కోవర్ట్ ఆపరేషన్ కు ప్రణాళిక సిద్ధం చేసి విజయం సాధించారు.

ఎన్కౌంటర్ జరిగిన తీరు తెన్నులు, పద్మక్క మృతదేహం నిర్ధారణకు ఈ జిల్లాలో పనిచేసిన నక్సల్స్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీసు అధికారులు హైదరాబాదు నుండి ఎన్కౌంటర్ ప్రదేశానికి రావడం తప్పించుకున్న దళ సభ్యులు వివరాలను నిర్ధారించుకోవడంతో కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు.

👉 సాంబశివుడి గుట్టలో పద్మక్క ఎన్కౌంటర్ !

ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గ్రామ సమీపంలోని సాంబశివుని గుట్టలో 2002 జూలై 2న ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఉత్తర తెలంగాణ కార్యదర్శి పద్మక్క @  రజిత , ఆమె సాయుధ అంగరక్షకురాలు మానస,  జిల్లా యాక్షన్ టీం కమాండర్ సాగర్, మరో యాక్షన్ టీం నాయకుడు విక్రమ్, హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా దళ సభ్యులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత కొన్ని నెలలకు  పోలీసులకు లొంగిపోయారు.

👉 48 గంటల ఆపరేషన్..

పద్మక్క సాంబశివుడి గుట్ట ఆడవుల్లో కచ్చితంగా ఉంటుందని కీలక సమాచారం మేరకు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అధికారులు, డిస్టిక్ గాడ్స్ ప్రత్యేక పోలీసు బలగాలు 48 గంటల ముందు నుండి  సాంబశివుడి గుట్టలు, అడవుల్లో గాలింపు చేపట్టారు. భారీ ఎన్కౌంటర్  అనంతరం మృతుల వివరాలను మీడియాకు  సహజంగా వివరించే జిల్లా ఎస్పీ, స్థానంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వివరించారు.

👉 మఫ్టీలో హైదరాబాద్ నుంచి పోలీసు అధికారి రాక !

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పద్మక్క ఎన్కౌంటర్ ప్రాంతాన్ని సందర్శించడానికి పరిసర గ్రామాల ప్రజలు జన జాతరల తరలివచ్చారు. గతంలో ఈ  జిల్లాలో విధులు నిర్వహించిన పోలీస్ అధికారి మఫ్టీ లో ఎన్కౌంటర్ సంఘటన స్థలానికి చేరుకొని నిర్ధారించుకొని తిరుగు ప్రయాణంలో తాను ప్రయాణించిన వాహనం వదిలి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడి కారులో కల్లెడ గ్రామ బస్టాప్ వరకు ప్రయాణించి అక్కడ నుంచి ప్యాసింజర్ జీపులో జగిత్యాలకు వెళ్లారు. ఈ ఎన్కౌంటర్  పక్కాగా కోవర్ట్ ఆపరేషన్ అనే చర్చ నెలకుంది.

👉 ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఒకే చోటు ఉంటారా ?

👉 ఉండవద్దు అనేది  మావోయిస్టు పార్టీ పొలిటి బ్యూరో ఆదేశాలు !

సోమవారం జరిగిన ఎన్కౌంటర్  లో హతమైన ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి  ఒకే ప్రాంతంలో ఎలా ఉంటారు ? అనే అనుమానాలు పౌర హక్కుల సంఘ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

చత్తీస్గడ్ లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మడ  అడవుల్లో సోమవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హతమైన విషయం తెలిసిందే.
పీపుల్స్ వార్ నక్సలైట్ పార్టీ, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందక ముందే పార్టీ అగ్ర నాయకులు, కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు దరిదాపు పరిసర రహస్య స్థావరాలలో ఇద్దరు ఉండరాదని ఆ పార్టీ పోలిట్ బ్యూరో  దాదాపు 20 సంవత్సరాల క్రితమే తీర్మానించి దళాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చర్చ.

1999లో  జరిగిన కొయ్యూరు ఎన్ కౌంటర్ లో ముగ్గురు కీలక అగ్రనేతలు హతం కావడంతో   నాటి నక్సలైట్ పార్టీ అగ్రనాయకత్వం ఎన్కౌంటర్ ను  సీరియస్ గా తీసుకుంది. కొయ్యూరు ఎన్కౌంటర్ నేపథ్యంలో  ఇద్దరు కీలకనేతలు, లేదా అగ్రనేతలు ఒకేచోట సమావేశం అవ్వకుండా ఆ పార్టీ పోలీస్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టు చర్చ.

  కట్టా, కడారి  ఇద్దరు కేంద్ర కమిటి సభ్యులు అబూజ్ మడ్ అడవుల్లో ఎన్కౌంటర్ లో హతం కావడం, వారిద్దరూ  ఓకే రహస్య స్థావరంలో ఎలా ఉంటారు ?  ఎందుకు ఉన్నారు ?  అనే విషయం లో  మావోయిస్టు పార్టీనే ప్రకటన జారీ చేస్తే తప్ప స్పష్టత ఉండదు.

👉 కేంద్ర కమిటీలో మిగిలింది ఎంతమంది ?

2026, మార్చి31వ తేదీకల్లా దేశంలో మావోయిస్టులు అన్నవాళ్ళే లేకుండా చేయాలన్నది ఆపరేషన్ కగార్ లక్ష్యం. ఈవిషయన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పలుసార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఆపరేషన్ కగార్ జోరుచూస్తుంటే  తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతోకాలం పట్టేట్లుగా లేదు. మావోయిస్టుపార్టీలోని కీలకనేతలు, అగ్రనేతలే టార్గెట్ గా భద్రతాదళాలు గాలిస్తూఎన్ కౌంటర్లు చేస్తున్నాయి.

ఇందుకోసం అధునాతనమైన సాంకేతిక సహకారంతోపాటు ప్రత్యేకంగా శాటిలైట్ టెక్నాలజీ, అత్యంత ఆధునిక ఆయుధాలు, ద్రోన్లు, దాదాపు లక్ష మంది మెరికల్లాంటి భద్రత దళాలు, రెడ్ కారిడార్  ఆపరేషన్ కగర్ లో దండకారణ్యంలో జల్లెడ పడుతున్నారు.

గత ఏడాదిగా కేంద్ర కమిటిసభ్యులు చలపతి, మాంఝీ, మోడెం బాలకృష్ణ, సహదేవ్ చనిపోగా ఇపుడు కట్టా, కడారి మృతిచెందారు. మే 25న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతం  కాగా వారం రోజులు ముందుగానే నంబల కేశవరావు కు రక్షణగా ఉన్న భద్రతలో ఇద్దరు అంగరక్షకుల దళం నుంచి అదృష్టమైనట్టు చర్చ  అనంతరం వాళ్లు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత మూడు నెలల క్రితం  జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల గణేశ్ @ ఉదయ్ హతం  అయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ జరగడానికి కొన్ని  వారాల ముందే గాజర్ల రక్షణ దళంలోని ఇద్దరు కీలక మావోయి స్థులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.

జార్ఖండ్ లో ఐదు నెలల క్రితం  జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝురీతో పాటు ఇద్దరు డివిజనల్ సభ్యులు, సెప్టెంబర్ లో జరిగిన ఎన్కౌంటర్లో సహదేవ్ సోరి తో పాటు ఇద్దరు విజనల్ కమిటీ సభ్యు లు హతం  అయ్యారు. జూన్ మాసంలో  ఇంద్రావతి నేషనల్ పార్కులో కేంద్ర కమిటీ సభ్యులు తెంటు లక్ష్మీనరసింహారలు,@  సుధాకర్ తోపాటు మైలా రవు ఆడెళ్లు, @ భాస్కర్ తో పాటు మరో 8మంది మద్దేడు ఏరియా కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు.  ఆ తర్వాత కొన్ని రోజులలోనే  సుధాకర్, భాస్కర్ ఎన్ కౌంటర్ అయ్యారు. దీంతో పౌర హక్కుల సంఘం నేతలు చేసిన ఆరోపణలు నిజమేనన్న పరి స్థితి ఏర్పడింది.

👉 మావోయిస్టు ఉద్యమానికి కోవర్ట్ తో చెక్ ?

తాజాగా నెలకొన్న పరిస్థితులతో మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర బిందువైన కేంద్ర కమిటీ సభ్యులను టార్గెట్ చేసి వారిని లేకుండా చేస్తే ఉద్యమం కాకావికలం అవుతుందని లక్ష్యంగా  వారిని టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు ఏరివేతకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.
ఇదే విధానం కొనసాగితే  కోవర్ట్ ఆపరేషన్ తో మావోయిస్టు కోటలు బద్దలు కావడం ఖాయం.