👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నవరాత్రుల పూజాలు అందుకున్న శ్రీ మహాగణపతి ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో పాటు, రైతాంగం ఆనందంగా ఉండేలా ఆ ఆది దేవుడి ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన
వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, నిమజ్జనానికి తరలి వెళ్తున్న వినాయకులకు టెంకాయ కొట్టి, పువ్వులుచల్లి, స్వాగతించారు.

వినాయక మండపాల నిర్వాహకులు, ప్రశాంతంగా, శాంతియుత వాతావరణం లో, నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


👉 నంది చౌరస్తా వద్ద స్వాగత వేదిక!

ధర్మపురి పట్టణంలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవానికి మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలతో నిర్వాహకులు ఏక దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ వినాయక తరలింపు వాహనాలను పూలతో అందంగా అలంకరణ చేసి శోభాయాత్రను నిర్వహించారు.


నంది చౌరస్తా వద్ద, మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన వేదికపై నుండి మంత్రి స్వాగతించారు. మహిళలు మంగళారతులు, గణపతి బప్పా మోరియా అంటూ చిన్నారుల నినాదాలతో కలసి మంత్రి సైతం నినాదాలు చేశారు. వేదికపై మున్సిపల్ కమిషనర్ తాసిల్దార్ ఎంపీడీవో, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

👉 భారీ ఏర్పాట్లు !
గోదావరి నది తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతతో, పాటు భారీ క్రేన్లను, నదిలోకి వెళ్ళకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు, నదిలోకి విగ్రహాలు తరలించడానికి తేప్పలను ఏర్పాటు చేశారు. నంది చౌరస్తా, ఇసుక స్తంభం, గోదావరి తీరం, గాంధీ చౌరస్తా వద్ద మున్సిపల్ సిబ్బంది చల్లటి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.


ధర్మపురి రోడ్లను స్థానిక మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గుంతలను స్టోన్ క్రష్ తో మరమ్మత్తులు చేసి పూడ్చారు, ప్రధాన కుడళ్ళలో ఐమాస్ లైట్లకు మరమ్మతులు చేశారు. గోదావరి నదిలో వినాయక వాహనాల రాకపోకలకు అదనంగా మరో రహదారి ఏర్పాటుచేసి, వన్ వే అమలు చేశారు. ఫైర్ ఇంజన్ ను నది తీరంలో అందుబాటులో ఉంచారు.



👉 ధర్మపురి క్షేత్రం కాషాయమయం!
స్థానిక విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో కాషాయ జండాల తోరణాలతో పాటు ప్రధాన కూడళ్ళను కాషాయ జెండాలతో అందంగా అలంకరించి ఇసుక స్తంభం వద్ద స్వాగతం ఏర్పాటు చేసి నిమజ్జన నిర్వాహకులకు విశ్వహిందూ పరిషత్ వారు గణపతి మెమొంటోలను బహుకరించారు.
👉 భారీ బందోబస్తు !

పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు తోపాటు నిర్వాహకులను ప్రాధేయపడుతూ వినాయకులను త్వరగా నది తీరంలో తరలించడానికి కృషి చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగింది.
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ సన్మానించిన యూత్ సభ్యులు !

నేరెళ్ల గ్రామంలో గణేశ్ శోభాయాత్ర నిమజ్జనం సందర్భంగా గ్రామంలోని భజరంగ్ దళ్ యూత్ అధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని శోభ యాత్రలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించారు.