👉 కేంద్ర కమిటీ సభ్యుడు రాజు దాదా @ కట్టా రామచంద్ర రెడ్డి !
👉 కోసా దాదా @ కాదరి సత్యనారాయణ రెడ్డి !
👉 సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ !
J.SURENDER KUMAR,
చతిస్గడ్ లోని నారాయణపూర్ జిల్లా (అభూజ్‌మాడ్) లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా @ కట్టా రామచంద్ర రెడ్డి మరియు కోసా దాదా @ కాదరి సత్యనారాయణ రెడ్డిలు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ₹40 లక్షల రివార్డ్ ఉందని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ రాబిన్సన్ ప్రకటించారు.
👉 నారాయణ జిల్లా ఎస్పీ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర అంతరరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని అభూజ్‌మాడ్ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు సోమవారం ఉదయం నుండి గాలిస్తుండగా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి అన్నారు.
కాల్పుల తర్వాత, మావోయిస్టు కేడర్ల మృతదేహాలతో పాటు ఏకే-47 రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక బీజీఎల్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం మరియు ఇతర సామగ్రి దొరికినట్టు తెలిపారు.
👉 వారి వివరాలను ఎస్పీ ప్రకటించారు.
రాజు దాదా @ కట్టా రామచంద్ర రెడ్డి @ గుడ్సా ఉసెంది @ విజయ్ @ వికల్ప వయస్సు: 63 సంవత్సరాలు, తండ్రి మల్లా రెడ్డి నివాసి: కరీంనగర్, కేంద్ర కమిటీ సభ్యుడు, సీపీఐ (మావోయిస్టు) రివార్డ్: ₹40 లక్షలు (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రకటించినది)


కోసా దాదా @ కాదరి సత్యనారాయణ రెడ్డి @ గోపన్న @ బుచ్చన్న వయస్సు: 67 సంవత్సరాలు తండ్రి కృష్ణా రెడ్డి, కరీంనగర్, కేంద్ర కమిటీ సభ్యుడు, సీపీఐ (మావోయిస్టు) రివార్డ్: ₹40 లక్షలు (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రకటించినది)


కేంద్ర కమిటీ సభ్యులైన రాజు దాదా మరియు కోసా దాదా గత మూడు దశాబ్దాలుగా దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీలో చురుకుగా ఉన్నారు మరియు అనేక హింసాత్మక సంఘటనలకు మాస్టర్‌మైండ్‌లుగా ఉన్నారు, దీనిలో అనేక మంది జవాన్లు అమరులయ్యారు అని ఎస్ పి తెలిపారు.

👉 భద్రతా దళాల మరో విజయం ఎక్స్ లో అమిత్ షా !
👉 బస్తర్ రేంజ్ ఐ జి సుందర్‌రాజ్ పి. మావోయిస్టులకు విజ్ఞప్తి!
మావోయిస్టు కేడర్లు మరియు వారి నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన అంతం వైపు వెళుతోందని స్వీకరించాలని, హింసా మార్గాన్ని విడనాడి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చి ప్రభుత్వం యొక్క లొంగిపోవడం మరియు పునరావాస నీతి కింద రక్షణ మరియు ప్రయోజనాలను పొందాలని కోరారు.
👉 ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉద్యమంలోకి…
ఎన్కౌంటర్ లో హతమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి @ రాజు దాదా, ఉపాధ్యాయ వృత్తి నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నారు.
రామచంద్రారెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ( ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) హుస్నాబాద్ నియోజకవర్గం లోని కోహెడ మండలం లోని తీగలకుంటపల్లి స్వగ్రామం. ఉపాధ్యాయుడిగా APTF జిల్లా బాధ్యులతో కలిసి పని చేశారు రామచంద్రారెడ్డికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు రాజా హైదరాబాదులో ఉంటున్నాడు రామచంద్రారెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానున్నట్టు చర్చ.
👉 ఎన్కౌంటర్ భూటకం పౌర హక్కుల సంఘం !
👉 అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు !
👉 కోవర్ట్ ఆపరేషన్ లో భాగమే కేంద్ర కమిటీ సభ్యులు హతం !
👉 న్యాయ విచారణకు డిమాండ్ !
చత్తీస్ ఘడ్ రాష్ట్రం , నారాయణపూర్ జిల్లాలో ని ఆభుజ్ మాడు అడవుల్లో సోమవారం జరిగిందని చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారని వార్తలు అందుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస మృతి చెందినట్లు చత్తీస్గడ్ పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్ నిర్ద్వందంగా బూటకమని పౌర హక్కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్ నారాయణరావు ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా పటిష్టమైన గార్డుల రక్షణ వలయంలో ఉంటారు. వీరు కనుక చనిపోయారంటే రక్షణగా నిలిచిన గార్డులు కూడా మృత్యువాత పడాలి . రక్షణ వలయానికి సంబంధించిన సమాచారం పోలీసులు ప్రకటించలేదు.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అనైతిక యుద్ధం గత 21 నెలలుగా కొనసాగిస్తున్నది. ఈ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రజా సమస్యల పరిష్కారం పైన దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడటం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి. దండకారణ్యంలో మోహరించిన అన్ని రకాల బలగాలను వెంటనే ఉపసంహరించాలని, ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.