గిరిజన సాంప్రదాయ మేరకే  జాతర అభివృద్ధి పనులు చేపట్టాలి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

👉 23 న  మంత్రుల, అధికారుల బృందంతో సీఎం మేడారంలో సమీక్ష !

J SURENDER KUMAR,

ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 23న స్వయంగా మేడారంలో పర్యటించి అక్కడే మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సురక్ష సమావేశం నిర్వహించనున్నారు.

👉 మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి  కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం మంత్రులు కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ధనసరి అనసూయ సీతక్క , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్ సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

👉 మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23 న మేడారం సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  నిర్ణయించారు.

👉 పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని చెప్పారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని అన్నారు.

👉 అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని చెప్పారు.

👉 ఆలయం పరిసర ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయ వృక్షాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభివృద్ధి ప్రణాళికపై ఈ నెల 23 న మేడారంలోనే మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి  సమీక్షించనున్నారు.