జగిత్యాల జైత్రయాత్ర కు బహుజనుల ఉద్యమమే ఊపిరి!

👉 నేటి స్వేచ్ఛ వాయువులకు నాటి ఉద్యమమే మూలం !


👉 జైత్రయాత్రకు రేపటికి 47 సంవత్సరాలు…


J SURENDER KUMAR,


75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 47 సంవత్సరాల క్రితం

ఉత్తర తెలంగాణ  జగిత్యాల లో బహుజనులు నిర్వహించిన

ఉద్యమం జగిత్యాల జైత్రయాత్రగా ఉద్యమాల చరిత్రలో ప్రత్యేక

గుర్తింపు కలిగివున్న, బడుగు బలహీన వర్గాలకు ప్రశ్నించే

తత్వాన్ని, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని కల్పించింది

జగిత్యాల జైత్రయాత్ర, అనేది అక్షర సత్యాలు. జగిత్యాల

పట్టణంలో జరిగిన జైత్రయాత్ర విజయవంతం కావడానికి

బహుజనుల పాత్ర కీలకం. 


దశాబ్దాలుగా బహుజనుల, అణగారిన వర్గాల ఆవేదన, ఆక్రందన, ఆవేశం నుంచి అగ్నిపర్వత విస్పోటంలా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమ కెరటాల స్ఫూర్తి నాడు, నేడు ఎన్నో వర్గాల ప్రజలు కు  ఊపిరి పీల్చుకోవడానికి ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. ” బాంచన్ అంటూ భయం, భయంగా, బతుకుతున్న  జనాలలో  ధైర్యం నింపి కొందరితో ఆయుధాలు పట్టించింది అని కూడా చెప్పుకోవచ్చు.  విప్లవాల ఉద్యమ చరిత్రలో జగిత్యాల జైత్రయాత్ర ఓ విశిష్ట స్థానం సంపాదించుకుంది అనే చర్చ నేటికీ  జరుగుతోంది.

👉 2025 సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల జైత్ర యాత్ర చరిత్ర 47 ఏళ్ళు…

👉 గ్రామాల్లో నాటి పరిస్థితులు !

1975 నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కొందరు దొరలు, భూస్వాములు, అటవీశాఖ, పోలీస్ పటేల్, పట్వారీల దౌర్జన్యాలు, దాస్టికాలు వర్ణనాతీతం. వారి  ఆగడాలను ప్రశ్నించినా,  వారి ఆగడాల గూర్చి  తమ తమ వాడలు, కుల సంఘాలలో చర్చించుకున్న వారిని  గ్రామ చావడిలో (నడి బజార్)  ప్రజల ముందు  కఠినంగా శిక్షించే వారు.

గ్రామాలకు పటేల్, పట్వారి, భూస్వాములు, దొరలు, గ్రామ పెద్దలు. ఇరువర్గాల ప్రజల పంచాయతీలను, వారు ఇష్టానుసారం నిర్వహించి తీర్పు చెప్పే వారు, డిపాజిట్ సొమ్మును ( దడువతు )  తిరిగి ఇరువర్గాలకు తిరిగి ఇచ్చేవారు కాదు, పంచాయితీ తీర్పు ఎలా ఉన్నా, ఇరువర్గాలు ప్రశ్నించే సాహసం చేయలేని దుస్థితి.  కొన్ని సందర్భాల్లో ప్రశ్నించే వారిని  గ్రామాల నుంచి వెలి వేసేవారు. వారి సామాజిక వర్గంతోనే వారిని కుల బహిష్కరణ చేయించేవారు.

దీనికి తోడు సంవత్సరాల తరబడి, కుటుంబాలకు, కుటుంబాలు వారి ఇళ్లలో వెట్టిచాకిరి. చేద బావులలో నీళ్లు తోడడం, బట్టలు
ఉతకడం, ఇల్లు వాకిలి శుభ్రపరచడం, వంట పాత్రలు  కడగడం స్నానాలకు నీళ్లుకాయడం, రాత్రి పగలు తదితర పనులతో  పాటువారి ఇళ్లలో కట్టు బానిసలుగా ఉండేవారు.

పటేల్, పట్వారిలకు, దొరలకు, భూస్వాములకు మాత్రమే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయ భూములు, మామిడి తోటలు, ఉండేవి.  బహుజన రైతులకు చెందాల్సిన  పరంపోగు , బంజరాయి, ప్రభుత్వ భూములు, వారి అధీనంలో ఉండేవి. దున్నడం, నాటు, కలుపు తీయడం, పంట  కోయడం, ఇళ్లకు చేర్చడం గ్రామీణ లు విధిగా వెట్టి చేయాల్సిందే. భూస్వాములు పట్టణాలకు చిన్న ఎడ్ల బండ్లలో ( సవారి కర్చురం ) వెళ్లే సందర్భంలో ఎడ్ల బండి ముందు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, విధిగా కిలోమీటర్ల దూరం పరిగెత్తేవారు, ఇది నాటి భూస్వాముల స్టేటస్ గా కొనసాగేది. గ్రామాల్లో  సారాయి, కలు, గుత్త దారులు ( కాంట్రాక్టర్లు ) తునికి ఆకు సేకరణ కూడా వారిదే. గ్రామాల్లో విద్య, వైద్యం, విద్యుత్  ఎండమావులే.

👉 1976 లో తపాల్ పూర్ లో భూస్వామిని హత్య !

మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం తపాల్ పూర్ భూస్వామి పీతాంబర్ రావు, ఇంటిపై 1976 సెప్టెంబర్ లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో  16 మంది దాడి చేసి ఆయను హతమార్చారు. A- 1 కొండపల్లి సీతారామయ్య, A-2 కొల్లూరి చిరంజీవి,  A-6 నల్ల ఆదిరెడ్డి తో పాటు A-8 గా ముప్పాల లక్ష్మణరావు @ గణపతి కలమడుగు పోలీస్ స్టేషన్ FIR లో నమోదయింది. 1977 ఏప్రిల్ లో గణపతిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై  వచ్చిన ముప్పాల లక్ష్మణరావు, @ గణపతి  అజ్ఞాతంలోకి వెళ్లారు ( నాడు ముప్పాల లక్ష్మణరావు,  @ రాధాకృష్ణ, మల్లన్న, పేర్లతో అజ్ఞాతంలో కొనసాగారు) 

👉 పల్లెలకు తరలండి క్యాంపెయిన్ కు శ్రీకారం.

గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు  వామపక్ష భావజాలం, మేధావులు,  విద్యార్థులను, యువకులను  పల్లెలకు తరలండి అనే క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. వీళ్లు రజకులు, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తారు, ఆయిల్ ఇంజన్లు రిపేర్ చేస్తారు, మన గ్రామాలకు పంపుతున్న పని ఇప్పించండి అంటూ ముప్పాళ్ళ లక్ష్మణరావు@ గణపతి, నరసింహులపల్లి, దొంతపూర్, బీర్పూర్, గ్రామాలలో తన స్నేహితులకు వివరించి ఆయా గ్రామంలో నివాసం ఉండేలా ప్లాన్ చేశారు. వారు కాలినడక, సైకిళ్లపై  పై గ్రామాల్లో తిరుగుతూ గ్రామీణుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఆధ్యాయం చేసుకునేవారు. ( దాదాపు రెండు నెలల పాటు ) గ్రామంలో ఉంటూ పనులు చేస్తూ ఉండేవారు.

ఇదే అవకాశంగా ఆయా గ్రామాలలో గ్రామీణులను చైతన్య పరుస్తూ  గ్రామ, గ్రామాన రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేశారు.
(కుల వృత్తుల వారు,  పాలేర్లు, వ్యవసాయ కూలీలు ) ప్రధానంగా రైతు కూలి సంఘాల్లో కీలకం. పాలేరులు జీతాలు పెంచకపోతే   పశువులను మేతకు తీసుకు వెళ్ళేవారు కాదు,  వ్యవసాయ కూలీ రేట్లు పెంచుకుంటే కలుపు, తీయడం, నాట్లు, వేయడం వరి కోతలు, బంతి కొట్టడం, చేయకపోయేవారు.  రజక, దళిత, నాయిని, కమ్మరి, కంచరి, కుమ్మరి, వడ్రంగి, గౌడ, తదితర కుల వృత్తుల వారు, తమ డిమాండ్ల సాధన కోసం  ఐక్యంగా ఉండేవారు. పరిసర గ్రామంలో రైతు కూలీ సంఘం ఏర్పడింది అని తెలియడంతో, ఇదే స్ఫూర్తితో  ఉత్తర తెలంగాణ జిల్లాలలో గ్రామ, గ్రామాన రైతు కూలీ సంఘాలు ఆవిర్భవించాయి.

👉 రైతు కూలీ సభ పేరిట…

రైతు కూలీ సంఘాలతో జగిత్యాల పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి దున్నేవాడికి భూమి కావాలి, పాలేరులకు  జీతాలు పెంచాలి, వెట్టి నిర్మూలించాలి అనే డిమాండ్ తో సభ జరుగుతుందని రైతు కూలీ సంఘాలకు క్యాంపెనింగ్ లో వారు వివరిస్తూ, వారిని జగిత్యాల సభకు తరలింపుకు సన్నద్ధం చేసేవారు.

👉 సైకిళ్లపై మావోయిస్టు అగ్ర నేతలు !

రహదారులు, రవాణా సౌకర్యాలు టీవీలు, పత్రికలు, టెలిఫోన్ లాంటి సదుపాయాలు నాడు లేవు. కరీంనగర్ ,ఆదిలాబాద్, నిజాంబాద్ జిల్లా (పడమటి ప్రాంతం) గ్రామాలలో గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు, శీలం నరేష్ ,నల్ల ఆదిరెడ్డి, సాయిని ప్రభాకర్, ముంజల రత్నయ్య, ఇట్టే లక్ష్మీనారాయణ, తుషార్ బట్టాచార్య, (ఆసిఫాబాద్, ఉట్నూర్, ప్రాంతలలో ) పోశెట్టి, అర్జయ్య ,తదితరులు, సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ జగిత్యాల సభకు రైతు కూలీ సంఘంలను రావాల్సిందిగా కోరేవారు.

జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ సమీపాన ఓల్డ్ హై స్కూల్  మైదానంలో 1978  సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు ( ఇదే జగిత్యాల జైత్ర యాత్ర పేరును సంతరించుకుంది ) వేలాదిమంది బహుజనులు గొంగడి, చేతిలో గుతుప కర్రలు, పట్టుకొని పాత బస్టాండ్, అన్నపూర్ణ చౌరస్తా, పోచమ్మ వాడ, తినిఖని చౌరస్తా, మంచినీళ్ళ బావి, టవర్ సర్కిల్,  లక్ష్మి టాకీస్ గుండా కాగడాల తో నిర్వహించిన ఊరేగింపు ఉద్యమాల చరిత్రలో రికార్డుగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా సరిహద్దు  గోదావరి నది తీర ప్రాంతం  గ్రామాల నుంచి  వేలాది మంది  బహుజనులు, ఎడ్ల బండ్ల ద్వారా, కాలినడకన, కొన్ని రోజుల పాటు ప్రయాణించి, వంట చేసుకుంటూ సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల కు చేరుకున్నారు. ఈ సభలో ప్రజాయుద్ధ నౌక, స్వర్గీయ గద్దర్ ఆడారు, పాడారు రైతు కూలీలను ఉత్తేజపరిచారు,  ముక్కు సుబ్బారెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సభతో గ్రామీణలలో ప్రశ్నించే దమ్ము, ధైర్యం గద్దర్ కల్పించారు అని చెప్పుకోవచ్చు.
ప్రముఖ సాహితీవేత్త, రచయిత, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు, ప్రభుత్వసంక్షేమ శాఖలో ఉద్యోగం వదిలి, సాయుధ పోరు బాట పట్టి, అజ్ఞాతంలోకి వెళ్లి  దళిత సాహిత్యం సృష్టించారు.

(ఫైల్ ఫోటో)

👉 పీపుల్స్ వార్ (సిపిఐ ఎంఎల్) పురుడు పోసుకుంది !

జగిత్యాల జైత్రయాత్ర  అనంతరం రెండు సంవత్సరాలకు  ఏప్రిల్ లో, 1980లో, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో మంచిర్యాల జిల్లా జన్నారం పరిసర పంట చేలలో పీపుల్స్ వార్ (సిపిఐ ఎంఎల్) అనే నక్సలైట్లు సంస్థ, పురుడు పోసుకుంది.  ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పౌరహక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, విప్లవ, దళిత సాహిత్య సమ్మేళనాలు, జననాట్యమండలి, సింగరేణి కార్మిక సమాఖ్య, తదితర వామపక్ష భావజాల సంస్థలు పురుడు పోసుకున్నాయి అని చెప్పుకోవాల్సిందే.

👉 ఉమ్మడి రాష్ట్రంలో కల్లోలిత ప్రాంతం !

జగిత్యాల జైత్రయాత్ర అనంతరం కొన్ని రోజులకే  జగిత్యాల జిల్లా డివిజన్ లోతునూర్ లో భూ వివాదంలో కాల్పులు జరిగాయి రైతు కూలీ సంఘం సభ్యుడు మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామీణ ప్రాంత ప్రజలలో ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తనం ,గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1978-79 లో  ఈ ప్రాంతంను, కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. పారామిలటరీ, ఇండో-టిబెటన్, స్పెషల్ పోలీస్ ఫోర్స్  బలగాలను గ్రామాల్లోకి ప్రభుత్వం దించింది.  పాఠశాలు, పంచాయతీ భవనాలు, భూస్వాముల గడీలలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. 

రైతు కూలీ సంఘం నాయకుల,  సభ్యుల గురించి వివరాలు సేకరిస్తూ గ్రామస్తులను చితకబాదడం, రైతుకూలీ సంఘం నాయకులు ఎవరు ?  ఇందులో సభ్యులు ఎంతమంది ?  వారికి భోజనాలు, ఎవరు పెడుతున్నారు?  అంటూ ఇళ్లపై దాడులు చేస్తూ, వంట సామాగ్రి బియ్యం పప్పులలో, కిరోసిన్ కలపడం, ఇంటిని చిందరవందర చేయడం, గ్రామాల్లో చిన్న పెద్ద మహిళలు, వృద్ధులు,  తేడా లేకుండా గ్రామ చావిడిలో వరుసగా కూర్చుండబెట్టి ఇష్టానుసారంగా స్పెషల్ పార్టీ పోలీసులు, లాఠీలతో కొడుతూ, దారుణంగా హింసించేవారు.

  ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీసులు (మంగళగిరి  స్పెషల్ పోలీస్ బెటాలియన్)  రాక్షస ఆనందం పొందే వారు. గ్రామాల్లో పోలీస్ క్యాంప్ లలో, గ్రామ ప్రజలతో బట్టలు, ఉతికించడం, వంటపాత్రలు కడిగించుకోవడం,  చేయించేవారు. గొర్రెలు, మేకలు, కోళ్లును వారితోనే బలవంతంగా తెప్పించుకొని  నిత్యం వండించుకునేవారు. గ్రామాలలో నిర్బంధంగా వడ్రంగులతో మంచాలు, పీటలు, టేకు కలప వస్తువులు చేయించుకొని తమ స్వగ్రామాలకు తీసుకు వెళ్లేవారు.

యువకులు, పై నక్సల్స్ సానుభూతిపరులు గా ముద్రలు వేసి వందలమంది పై పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసే వారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ. యువకులు ఆయా పోలీస్ స్టేషన్లకు, పోలింగ్ కేంద్రాలకు, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు, వీరిని రక్షణ కవచం గా  వాడుకునేవారు. పోలీసుల దెబ్బలు, వేధింపులు, కేసులు భరించలేక అనేకమంది యువకులు బడుగు, బలహీన వర్గాల ప్రజలు, ఉన్న ఊరును, చేతి వృత్తులను, తమ వ్యవసాయ భూములను, భార్య పిల్లల్ని,  వదిలి భీమండి, షోలాపూర్, ముంబాయి, దుబాయ్ తదితర ప్రాంతాలకు పారిపోయి అజ్ఞాత జీవితం గడిపేవారు. 

కొంతమంది యువకులు అజ్ఞాత బాట పట్టి నక్సలైట్ లో చేరేవారు. దీంతో  గెరిల్లా దళాలు, గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థ ఏర్పాటు, టార్గెట్లను గ్రామ బహిష్కరణ, వారి భూముల ను బీడు పెట్టించడం, పాలేర్లు బంద్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు.

జైత్రయాత్ర అనంతరం ఉత్తర తెలంగాణ జిల్లాలలో నిర్బంధాలు, తుపాకుల నీడలో గ్రామాల జీవనం, ఎన్కౌంటర్లుతో భయం భయంగా జీవన కొనసాగించేవారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో సాగు, తాగు నీరు, విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజానీకం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. నాలుగున్నర దశాబ్దాల క్రితమే ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని కల్పించింది నాటి జగిత్యాల జైత్రయాత్ర,  ఈనాటి స్వేచ్ఛ వాయువులకు  బహుజన వర్గాల పోరుబాటనే కీలక పాత్ర  అనే చర్చ నేటికీ కొనసాగుతుంది.