జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క్రియ‌ వేగ‌వంతం చెయ్యాలి !

👉 ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

తెలంగాణలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం చెల్లింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ విష‌యంలో మాన‌వీయ కోణంలో వ్య‌వ‌రించాల‌ని, అదే స‌మ‌యంలో ర‌హ‌దారుల నిర్మాణంతో క‌లిగే లాభాల‌ను రైతుల‌కు వివ‌రించి ప్ర‌క్రియ‌ను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

👉 రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం, అనుమ‌తుల జారీ, నూత‌న ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన ముఖ్య‌మంత్రి  జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (NHAI), జాతీయ ర‌హ‌దారుల విభాగం (NH), జాతీయ ర‌హ‌దారులు, రోడ్డు ర‌వాణా మంత్రిత్వ శాఖ (MoRTH), ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ (R&B‌) అట‌వీ శాఖ అధికారుల‌తో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు.

👉 జాతీయ ర‌హ‌దారులకు నెంబ‌ర్ల కేటాయింపు, సూత్ర‌ప్రాయ అంగీకారం తెలుపుతున్నా, త‌ర్వాత ప్ర‌క్రియ‌లో జరుగుతున్న జాప్యంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. చిన్న చిన్న కార‌ణాల‌తో ప‌లు ర‌హ‌దారుల ప‌నుల్లో జాప్యం జరగొద్దని, అలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. భూ సేక‌ర‌ణ‌ను పూర్తి చేయడమే కాకుండా ప‌రిహారం త‌క్ష‌ణ‌మే అందేలా చూడాల‌ని చెప్పారు.

👉 రీజిన‌ల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవ‌నెత్తిన ప్ర‌తి సందేహాలను నివృత్తి చేస్తున్నప్పటికీ కొత్త స‌మ‌స్య‌లను ఎందుకు లేవ‌నెత్తుతున్నారని ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌ను ముఖ్యమంత్రి  ప్ర‌శ్నించారు. సందేహాల‌న్నింటిని ఒకేసారి పంపాల‌ని కోరినప్పుడు, ఎటువంటి సందేహాలు లేవ‌ని, ఏవైనా ఉంటే వెంట‌నే పంపుతామ‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు.

👉 “ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలు రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దు. సౌత్‌కు కూడా నార్త్‌కు ఇచ్చిన నెంబ‌ర్‌ను కొన‌సాగించాలి. వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేసి ఏక‌కాలంలో రెండింటి ప‌నులు ప్రారంభ‌మ‌య్యేందుకు ఎన్‌హెచ్ఏఐ సహకరించాలి. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంట‌నే ఆమోద‌ముద్ర వేయాలి.

👉 భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ – అమ‌రావ‌తి – మ‌చిలీప‌ట్నం 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంట‌నే అనుమ‌తులు ఇవ్వాలి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తాము డ్రైపోర్ట్‌, లాజిస్టిక్ పార్క్‌, ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటు చేస్తాం.

👉 ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజ‌ధానుల మ‌ధ్య అనుసంధానం ఏర్ప‌డ‌డంతో స‌ర‌కు ర‌వాణా, ప్ర‌యాణికులకు ఎంత‌గానో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ‌ల మ‌ధ్య 70 కి.మీ దూరం తగ్గడంతో పాటు స‌రుకు ర‌వాణాతో దేశంలో మ‌రే జాతీయ ర‌హ‌దారిపై లేనంత ర‌ద్దీ, ఆదాయం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఏర్పడుతుంది.

👉 ఈ ర‌హ‌దారికి స‌మాంత‌రంగా తాము రైలు మార్గం అడుగుతున్నాం, బెంగ‌ళూర్‌ – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ -అమ‌రావ‌తి మ‌ధ్య రైలు మార్గం అవ‌స‌రం. వందేభార‌త్ సహా ఇత‌ర రైళ్ల రాక‌పోక‌ల‌కు ఇది అనువుగా ఉండటమే కాకుండా లాభసాటిగా ఉంటుంది.

👉 హైద‌రాబాద్‌ – శ్రీ‌శైలం మార్గంలో రావిర్యాల – మ‌న్న‌నూర్‌కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంట‌నే అనుమ‌తులు ఇవ్వాలి. శ్రీ‌శైలం దేవ‌స్థానం, శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్‌, టైగ‌ర్ ఫారెస్ట్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు రాక‌పోక‌లు సాగిస్తారు” అని వివరించారు.

👉 హైద‌రాబాద్‌ – మ‌న్నెగూడ ర‌హ‌దారిలో మ‌ర్రి చెట్ల తొల‌గింపున‌కు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు ప‌రిష్కారానికి స‌త్వ‌ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చర్యలు తీసుకోవాలి. హైద‌రాబాద్‌-మంచిర్యాల‌ – నాగ్‌పూర్ నూత‌న ర‌హ‌దారికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఎన్‌హెచ్ఏఐ అంగీక‌రించాలి.

👉 మంచిర్యాల‌ – వ‌రంగ‌ల్‌ – ఖ‌మ్మం – విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారి (NH-163G), ఆర్మూర్‌ – జగిత్యాల‌ – మంచిర్యాల (NH-63), జ‌గిత్యాల‌ – క‌రీంన‌గ‌ర్ (MH-563), మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ – మ‌రిక‌ల్‌ – దియోసుగూర్ (NH-167) ర‌హ‌దారుల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్ట‌ర్ల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి  ప్రశ్నించారు.

👉 అన్ని జిల్లాల్లో ఉన్న కేసుల‌న్నింటిపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌తో చ‌ర్చించి వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గారిని ఆదేశించారు. ఈ విష‌యంలో ఏమాత్రం జాప్యాన్ని స‌హించ‌మ‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను హెచ్చ‌రించారు.

👉 భూసేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీని అక్టోబ‌రు నెలాఖ‌రుకు క‌చ్చితంగా పూర్తి చేయాల్సిందేన‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం నిర్ణ‌యం, పంపిణీ విష‌యంలో అల‌స‌త్వం చూపే క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు, త‌హ‌శీల్దార్ల‌పై వేటు వేస్తామ‌ని హెచ్చరించారు.

👉 జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపైనా సీఎం  స‌మీక్షించారు. అవ‌స‌ర‌మైన‌చోట‌ ప్ర‌త్యామ్నాయ భూమిని అట‌వీ పెంప‌కానికి ఇస్తామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో అవ‌స‌ర‌మైతే జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ని, కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ తో స్వ‌యంగా కలిసి మాట్లాడుతానని చెప్పారు.

👉 ఈ స‌మావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ‌కృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి విన‌య్ కుమార్ ర‌జావ‌త్‌ , ఎన్‌హెచ్ఏఐ స‌భ్యుడు (ప్రాజెక్ట్స్‌) అనిల్ చౌద‌రి , MoRTH రీజినల్ ఆఫీస‌ర్ కృష్ణ ప్ర‌సాద్‌ , ఎన్‌హెచ్ఏఐ రీజిన‌ల్ ఆఫీస‌ర్ శివ‌శంక‌ర్‌ పాల్గొన్నారు.