J . SURENDER KUMAR,
అయిదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో
మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన
నక్సల్స్ అగ్ర నాయకత్వంలో గాంధేయవాదమా ?
గాడ్సే వాదమా ? అనే చర్చ తో పాటు
గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్న
పరిస్థితి కనబడుతోంది.
మావోయిస్టు పోరాట చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తో పాటు కేంద్ర బలగాల కూంబింగ్ లో వరుస ఎన్కౌంటర్లు కేంద్ర కమిటీ సభ్యులు హతమవడం, వారిలో కొందరు ఆయుధాలతో ప్రభుత్వానికి లొంగడం, 2026 మార్చినాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామంటూ హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనలతో దళాలలో, దళ నాయకులలోను అభద్రత భావానికి మరో కారణం కావచ్చు.

👉 ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..
కొన్ని నెలల క్రితం మావోయిస్టు పార్టీ, భేషరతుగా కాల్పులు విరమణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల కు ప్రతిపాదనను మొదటిసారిగా ప్రతిపాదించింది, తెలంగాణ ప్రాంత పౌర హక్కుల సంఘాల అభ్యర్థన మేరకు, కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన కు భేషరతుగా మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేయడం, దండకారణ్యంలో అమాయక పౌరుల, ఆదివాసీల ప్రాణాలు ఈ పోరాటంలో బలి కావద్దు అనే ఉద్దేశంతో అంటూ మావోయిస్టు పార్టీ జారీ చేసిన ప్రకటనల లో స్పష్టంగా పేర్కొంది.
👉 సోను దాదా ( అభయ్ ) బహిరంగ ప్రకటన నేపథ్యంలో.. ప్రకటనలోకొన్ని వ్యాఖ్యానాలు…

👉 గత 20 మాసాలకు పైగా భారత దోపిడీ పాలకవర్గాలు కొనసాగిస్తున్న ‘చుట్టుముట్టి మట్టుబెట్టే’ దాడులను మనమంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నాం. ఈ దాడులలో మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు సహ వందలాది మంది కామ్రేడ్ను, విప్లవ ప్రజా సంఘాల, ప్రజా మిలీషియా, జనతన సర్కార్ల కార్యకర్తలను, విప్లవ ప్రజలనూ కోల్పోయాం. తెరిపి లేకుండా కొనసాగిస్తున్న నరసంహారాలలో ఆడ-మగ, పిల్లలు-వృద్ధులు అనే తేడా లేకుండా మనం ఒక్కొక్క దాడిలో పదుల సంఖ్యలో కామ్రేడ్స్ను కోల్పోతున్నాం. విప్లవోద్యమం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తున్న అమర వీరులందరికి పేరు పేరునా విప్లవ జోహార్లు అర్పిద్దాం. వారి ఆశయాల సాధనకై సరైన మార్గంలో ముందుకుపోదాం. అని పేర్కొనబడింది.
👉 మా పార్టీ సాధిస్తున్న అచీవ్మెంట్స్ ఎంత గొప్పవో, మా పార్టీ చేస్తున్న తప్పులూ అంతకన్నా తీవ్రమైనవి కావడంతో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ సాపేక్షికంగా నిలకడైన, బలమైన సంఘటిత విప్లవోద్యమాన్ని నిర్మించలేకపోయాం అనేది ఓ చేదు వాస్తవం.
👉 ప్రపంచంలో, దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మా పార్టీ తొలినుండి చాలా వెనుకబడుతూ వస్తోంది. శత్రువు బలాన్ని, విప్లవ శక్తుల బలాన్ని సరిగా అంచనా వేసుకొని తగిన ఎత్తుగడలతో విప్లవోద్యమాన్ని నిర్మించడంలోనూ తప్పులు చేస్తూ వస్తున్నది.
👉 దేశంలో ఒకనాడు విప్లవోద్యమానికే తలమానికంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమం వరుస ఆటు, వెనుకంజలను ఎదుర్కొంటూ చివరకు 21వ శతాబ్దం ప్రారంభ దశాబ్దం మధ్యనాటికే దెబ్బతినిపోయింది. ఇక ఆ తరువాత ఆ ఉద్యమం గడచిన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అక్కడ తిరిగి పునర్వికాసం జరుగలేదు.
👉 ఇటీవలే, ఏఓబీలో మిగిలిన అతికొద్ది మంది కామ్రేడ్స్ నాయకత్వం సహ అమరులైనారు. ఆ వరుసన దేశంలోని ఏ ప్రాంతంలోనూ యంయంసీ, ఒడిశా, పశ్చిం బంగాల్, పశ్చిమ కనుమలు మున్నగు అటవీ ప్రాంతాలు సహ ఏ రాష్ట్రంలోనూ సాపేక్షికంగా, నిలకడ కలిగిన బలమైన విప్లవోద్యమాన్ని దశాబ్దాలు గడుస్తున్నా నిర్మించలేకపోతున్నాం.
👉 ఒకనాడు దేశంలోని 16 రాష్ట్రాలలో, దాదాపు 150 జిల్లాలలో విప్లవోద్యమం తన ఉనికిని చాటుకుంది. వీటిలో ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో సాపేక్షికంగా ఎక్కువ కాలమే బలంగా నిలబడగలిగింది. దండకారణ్యం, బిహార్ – ఝార్ఖండ్లలో విప్లవ ప్రజా ఉద్యమం విముక్తి ప్రాంత లక్ష్యాన్ని చేపట్టి నూతన ఎత్తులకు ఎదిగింది. అందుకు అక్కడి ఆర్థిక, రాజకీయ, సామాజిక విశేష పరిస్థితులను అర్థం చేసుకొని పని చేయడంతో పాటు శత్రువు బలహీనతలు ప్రధానంగా తోడ్పడ్డాయి.
ఈ రెండు ప్రాంతాలు సహ గత దశాబ్దన్నర కాలంగా ఎక్కడా విప్లవోద్యమం బతికి బట్టకట్టే పరిస్థితులే లేకుండా పోయాయి.
👉 దశాబ్దాలుగా అనేక త్యాగాలతో నిర్మించుకున్న విప్లవోద్యమాలను శత్రు వర్గాలు పదే పదే ఓటమి పాలు చేయగలుగుతున్నాయి. మా ఓటమికి శత్రువు గొప్పతనం కన్నా మా బలహీనతలు, తప్పులే ప్రధానమైనవని ఒప్పుకుంటున్నాం.
👉 ఈరోజు దేశంలో ఎక్కడా బలమైన విప్లవోద్యమం మాట పక్కన పెట్టినా కనీసం ‘స్థిరంగా’ నిలబడలేని స్థితికి పార్టీ చేరుకుంది.
👉 దేశంలోని అనేక ప్రాంతాలలో దెబ్బ తిన్న విప్లవోద్యమాలను పునరాభివృద్ధి చేసుకోవడానికి అనేక అవకాశాలను ఎక్కడికక్కడే దేశంలో సానుకూలంగా మారుతున్న విప్లవ పరిస్థితులు
సృష్టిస్తూ వస్తున్నప్పటికీ మా పార్టీ వాటిని స్వయం కృతాపరాధాలతో కాలదన్నుకుంది. మరోవైపు, పార్టీ అనుసరించిన అతివాద ఒంటెత్తుపోకడలతో కూడిన తప్పిదాలు ప్రజలలో వివిధ రూపాలలో ప్రతిబింబిస్తూ ఒక పెద్ద సెక్షన్ విప్లవోద్యమానికి దూరమైంది.
👉 సమాజంలో తీవ్రతరమవుతున్న అనేక ప్రజా సమస్యలను, రకకరాల రుగ్మతలను, సహజంగానే బూర్జువా పార్టీలు తమ విజయాలకు ఉపయోగించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. అంతిమంగా, పరిస్థితి ఎక్కడికి చేరిందంటే, దండకారణ్యం, బీ-జు సహ దేశంలో ఎక్కడా మా పార్టీ నాయకత్వంలో ఉ ద్యమాలు బలపడలేకపోతున్నాయి, చివరకు ఓటమికి చేరుకున్నాం. వీటి లోపాలను వ్యక్తులలో, పార్టీ కమిటీలలో చూస్తూ వచ్చాం.
👉 మా నాయకత్వ అవగాహనలో, సిద్దాంత అధ్యయనంలో, మారుతున్న పరిస్థితులకు దానిని అన్వయించడంలో జరుగుతున్న లోపాలుగా అర్థం చేసుకోలేకపోయాం. దానితో, ఆ తప్పులు భారత విప్లవోద్యమాన్ని మరోసారి వెనక్కి నెట్టాయి.
👉 ఇలాంటి పరిస్థితులలో, పార్టీ గత తప్పుల నుండి నేర్చుకుంటూ తిరిగి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయకుండా సాధ్యం కాదనేది తేలిపోయింది.
👉 మా పార్టీ జనరల్ సెక్రటరీ శాంతి చర్చలకు సిద్ధపడడం వెనుక ఈ అవగాహనే బలంగా పని చేసి వుంటుంది. ప్రజల మధ్యకు బహిరంగంగా వెళ్లి ప్రజా సమస్యలపై వారిని పునఃసంఘటితం చేస్తూ గత తప్పులకు తిరిగి నెట్టబడకుండా, విప్లవోద్యమాన్ని నిర్మించడమే ఇక పార్టీ ముందు మిగిలిన ఏకైక మార్గంగా మిగిలింది. పార్టీ చేసిన తప్పులకు వెలకట్టలేని త్యాగాలతో మూల్యాన్ని చెల్లించాం.
👉, దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా అంటూ, సాయుధ పోరాటం అంటూ, పరిస్థితులలోని మార్పులతో, స్థల కాలాలతో నిమిత్తం లేకుండా, చైనా పంథా, రష్యా పంథా అనే పిడివాద ఆచరణకు స్వస్తి చెప్పి భారతదేశ స్థల కాల పరిస్థితులకు తగిన పంథాలో భారత విప్లవాన్ని జయప్రదం చేయడానికి పూనుకోవడమే పార్టీ ముందు మిగిలిన ఏకైక కర్తవ్యం. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుంటారనీ విజ్ఞప్తి చేస్తున్నాం.
👉 విప్లవోద్యమంలో మీకు కలిగిన నష్టాలకు, మీరు భరించిన కష్టాలకు, మీరు చేసిన అసమాన, అనుపమాన త్యాగాలకు మేమే బాధ్యత పడుతున్నాం. మా మిడిమిడి జ్ఞానంతో, వస్తుగత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో చేసిన పొరపాట్లకు, మా ఆచరణలో అవలంభించిన అతివాద ఒంటెత్తువాద తప్పులకు మమ్మల్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుదీర్ఘకాలంలో జరిగిన తప్పులకు బాధ్యత పడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం..

👉 మేం తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేయడాన్ని అర్థం చేసుకోగలరు. ఈ నిర్ణయం తీసుకోకుండా రక్తసిక్తం అవుతున్న అడవులను శాంతి వనాలుగా మార్చలేం. ఈ నిర్ణయం తీసుకోకుండా మిగిలిన విప్లవ శక్తులనైనా కాపాడుకోలేం. ఈ నిర్ణయం తీసుకోకుండా, మీ త్యాగాలకు, అమరుల బలదానాలకు న్యాయాన్ని చేకూర్చలేం. ఈ ‘ఓటమి’ బాధాకరమైనదే. కానీ, విజయానికి తల్లి లాంటిదనే బలమైన విశ్వాసంతో న్యాయమైన ప్రజా సమస్యలపై న్యాయబద్దమైన పోరాటాలకు పూనుకుందాం. అంటూ అనేక అంశాలు ప్రకటనలో పేర్కొనబడింది.
👉 కేంద్ర కమిటీ సభ్యుడు సోను (అభయ్ ) వ్యక్తిగత అభిప్రాయం !
( మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ )

👉 కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన, సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం కాదు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
👉 కేంద్రంలోని బిజెపి పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
👉 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది.
👉 ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ-కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.
👉 కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపు టేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోమ్ మంత్రి బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటించాడు.
👉 మరొక వైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధ కాండను నిలుపుదల చేయాలని అందోళన చేశారు. యద్ధ కాండను ఆపాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు.
👉 మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధ కాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది.
👉 మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి,
మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్ (జార్ఖండ్), లు అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితోల్లో కొంత మంది రాష్ట్ర కమిటీ సభులు, క్రింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.
👉 మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేప నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య.
👉 కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ కు పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు.
👉 ఇలా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావడం లేదు. ఉద్యమాన్ని విడిచి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి.
👉 అది చేయక పోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది.
👉 దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరు అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించేవాళ్లు ఇలా చేయరు.
👉 నేడు పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగా ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు.
👉 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్ధం అవుతుంది.
👉 ప్రపంచ వ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి.

👉 ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.
👉 ప్రజలు విప్లవ ఉద్యమంలో భాగస్వాములు కావాలి!
(మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెప్టెంబర్ 6న విడుదల చేసింది ప్రకటనలో)

👉 మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కావాల్సిందిగా దేశంలోని అశేష ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.
👉 సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గాన్ని, భూస్వామ్య వర్గాన్ని అధికారం నుండి కూలదోయడం ద్వారా దేశంలో దోపిడి, పీడనలు లేని నూతన ప్రజాస్వామిక వ్యవస్థను, సోషలిజాన్ని నెలకొల్పడం కోసం సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కావాల్సిందిగా అశేష ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.
👉 మన పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించే దుష్టలక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ విప్లవ ప్రతిఘాతక యుద్ధాన్ని తిప్పికొడుదాం.
👉 ప్రజాపునాదిని, స్వీయాత్మక శక్తులను పెంచుకుంటూ పార్టీని, పీ.ఎల్.జీ.ఏ.ను, ప్రజా నిర్మాణాలను/ఐక్యసంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.
👉 లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దాం. పీడిత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు దృఢంగా పోరాడుదాం.
👉 శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం.నిరంతరం పెంపొందే ప్రజాపునాదిపై ఆధారపడి శక్తిమేరకు గెరిల్లాయుద్ధాన్ని కొనసాగిద్దాం.
👉 సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్ని తీవ్రతరం చేద్దాం.
👉 బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం.
👉 మార్క్సిజం-లెనినిజం- మావోయిజం వర్ధిల్లాలి.
భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి.
ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పి.ఎల్.జీ.ఏ.) వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వర్ధిల్లాలి. అంటూ ప్రకటనలో పేర్కొనబడింది

మావోయిస్టు పార్టీ నేత అభయ్ పేరుతో లేఖ ప్రస్తుతం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది విప్లవ సానుభూతిపరులను చాలా గందరగోళం గురిచేస్తుంది . మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన లేఖలో వాస్తవం ఎంతుందో ? ఇది మావోయిస్టు పేరుతో వచ్చిన నకిలీ లేఖనా ? ఇది ప్రభుత్వ యంత్రాంగం పోలీసు వర్గాల సృష్టియా ? ఇది పోలీస్ వర్గాల సృష్టి అని బలంగా వాదించేవారు ఉండవచ్చు, ఉండకపోవచ్చు .
మావోయిస్టు పార్టీ పేరుతో జారీ అవుతున్న ప్రకటనలతో మావోయిస్టులలో గాంధేయ వాదం , గాడ్సేవాదం వైపు కొందరు పయనిస్తున్నట్టు చర్చ మొదలైంది అని అనుకోవచ్చు.