మేడారం వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

J SURENDER KUMAR.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  మేడారం వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మలను మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు వారికి ఆశీర్వచనం అందించారు. అంతకుముందు శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ముఖ్యమంత్రి  నిలువెత్తు (68 కిలోలు) బంగారం సమర్పించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  వెంట మంత్రులు కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి , గిరిజన ప్రాంత  ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

👉 ఆలయ ప్రాంగణ చెట్లపై వేటుపడవద్దు !

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్వయంగా పరిశీలించారు. ఉదయం ములుగు జిల్లా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి  మంత్రులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రాంగణ ప్రాంతాన్నంతా తిరిగి పరిశీలించారు.

ఇల‌వేల్పులు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణానికి సంబంధించి చేపట్టే అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలో చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ కార్యక్రమాలు జరగాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా పూజారులు, ఆదివాసీ పెద్దలతో సంప్రదిస్తూ పనులు కొనసాగించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.