👉 బాంచన్ దొరను పక్కనబెట్టి… పిడికిలెత్తిన విప్లవం !
👉 బహుజనుల ఐక్యతారాగానికి నిలువెత్తు సాక్ష్యం !
👉 తాడిత, పీడితవర్గాల అణిచివేతపై ప్రతిఘటన !
👉 బలహీనవర్గాల స్వేచ్ఛావాయువుల కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం !
J. SURENDER KUMAR,
జగిత్యాల జైత్రయాత్ర ఉత్తర తెలంగాణాలో బహుజనుల మూకుమ్మడి పోరాటాలకు బీజం వేసిన ఓ మహోద్యమం. బడుగు, బలహీన వర్గాలకు ప్రశ్నించే తత్వాన్ని, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని నేర్పిన ఉద్యమాల్లో ఇదీ ఒకటి.
👉 అగ్నిపర్వతం విస్ఫోటనమైతే ఏవిధంగా ఉంటుందో, దశాబ్దాల వెట్టి, బానిసత్వ పోకడలను నిలదీస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటం జగిత్యాల జైత్రయాత్ర.
👉 బాంచన్ అంటూ భయం భయంగా బతుకీడే రోజుల్లో బహుజనుల్లో ధైర్యాన్ని నింపింది కొందరైతే ఏకంగా అటవీ బాట పట్టి ఆయుధాలే చేతబూనారు.
👉 జగిత్యాల సభకు హాజరైన ఒక్కొక్కరూ ఒక్కో నిప్పు కణికలా మారారు. అందుకే ఈ జైత్రయాత్రకు చరిత్రలో ఓ విశిష్ఠ స్థానం దక్కింది.
👉 2025 సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల జైత్రయాత్ర చరిత్రకు 47 ఏళ్ళు!

👉 పటేల్, పట్వారీలు, భూస్వాములు, దొరలే గ్రామపెద్దలు. ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగితే డిపాజిట్ డబ్బు పేరిట వసూళ్లు చేసేవారు.
👉 ఇష్టానుసారం తీర్పులు చెప్పేవారు. ప్రజల ముందే వారిని కఠినంగా శిక్షించే వారు. అది మరొకరికి గుణపాఠంలా ఉండాలనేలా ఆ శిక్షలు నేటి సినిమాల్లో విలన్లను తలపించేవి.
👉 అణగారిన వర్గాలను బానిసత్వం, వెట్టితో పాటు, వారు రెక్కలు కూడగట్టుకుని సంపాదించుకున్న కాస్తోకూస్తో కూడా వారి నుంచి లాక్కునే కఠినమైన పద్ధతులు నాడు కనిపించేవి.
👉 బహుజనులకు చెందాల్సిన పరంపోగు, బంజరాయి, ప్రభుత్వ భూముల్లోనూ వారిదే ఆధిపత్యం. దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం, ఇళ్లకు ఆ ధాన్యాన్ని, పంటను భూస్వాముల ఇంటికి చేర్చడం, వీటికి మాత్రమే బహుజనులు అర్హులు.
👉 తపాల్పూర్ సంఘటనలో అరెస్టు అయిన తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన ఓ ఇంటలిజెంట్ అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనే జగిత్యాల జిల్లా బీర్పూర్ కు చెందిన ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కీలకం అయ్యాడు.
👉 నాడు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి గణపతి చలించిపోయాడు.
👉 తనలాంటి భావజాలం కల్గిన మేధావులు, మరికొందరు విద్యార్థులు, యువకులను కలుపుకుని పల్లెలకు తరలండి అంటూ నినదించాడు.
👉 పల్లె పల్లెన నాటి జగిత్యాల జైత్రయాత్ర కోసం ప్రచారం చేపట్టాడు వారే రైతు కూలీ సంఘాలకు బీజం వేసినవారు.
👉 (సకలజనుల సమ్మె తరహాలో) ఐకమత్యంతో ఏకతాటిపైకొచ్చాయి. అలా బీర్పూర్ ప్రాంతంలో మొదలైన రైతు కూలీ సంఘం ఏర్పాటు విస్తరించి ఉత్తర తెలంగాణా జిల్లాల్లో సంఘాలు ఆవిర్భవించాయి.
👉 రైతుకూలీ సభ పేరిట మొదలైన జైత్రయాత్ర, వెట్టి నిర్మూలన వంటి డిమాండ్లతో రైతు కూలీ సభ పేరిట జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటుకు సమాలోచనలు మొదలయ్యాయి.
👉 ఉత్తర తెలంగాణాలోని అన్ని రైతు కూలీ సంఘాలకు సందేశాన్ని చేరవేశారు, జగిత్యాల సభకు సన్నద్ధం చేశారు.
👉 1978, సెప్టెబర్ 9న సభకు ఏర్పాటు చేశారు. ఆ సభ
ఉద్యమాల చరిత్రలోనే ఒక కొత్త ముఖచిత్రాన్ని కళ్లకుగట్టింది.
👉 ప్రజాయుద్ధ నౌక హాజరై ఆడిపాడాడు రైతుకూలీలను ఉత్తేజపర్చాడు సుబ్బారెడ్డి ఆ సభకు అధ్యక్షత వహించాడు.
👉 గద్దర్ ఆటాపాట, వక్తల భావోద్వేగపు మాటలు వెరసి.. బహుజనులకు ప్రశ్నించే దమ్ము, ధైర్యాన్ని నూరిపోసింది జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభ
👉 జగిత్యాల జైత్రయాత్ర తెచ్చిన మార్పేంటంటే, బడుగు, బలహీనవర్గాలవారు కూడా ఎన్నికల్లో నిలబడేందుకు అవకాశం కల్పించింది ఈ జైత్రయాత్ర.
👉 జగిత్యాల జైత్రయాత్ర ప్రశ్నించే తత్వాన్ని నూరిపోసింది. చైతన్యాన్ని రాజేసింది.

👉 ఇవాళ ప్రజలకు కావల్సిన కనీస మౌలిక సదుపాయల కల్పన జరుగుతోందంటే, . నాడు జరిగిన ఎన్నో ఘటనల ఫలితంగానే చూడాల్సి ఉంటుంది. అందుకే జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.