👉 2019లో రికార్డుస్థాయిలో 2 కోట్ల 76 లక్షల మంది దర్శించుకున్నారు !
👉 ఈ సంవత్సరం ఆగస్టు నాటికి కోటి 76 లక్షల మంది స్వామివారి దర్శించుకున్నారు !
J.SURENDER KUMAR,
గత 11 ఏళ్లలో తిరుమల శ్రీవారిని 25 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. 2015 నుంచి చూస్తే 2019లో రికార్డుస్థాయిలో రెండు కోట్ల 76 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు కోటి 76 లక్షల మందికి దర్శనభాగ్యం లభించింది. మిగిలిన నాలుగు నెలల్లో మరో 80 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తుండడంతో మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది.
👉 1950కి పూర్వం….
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. 1943కి పూర్వం తిరుమలకు చేరుకోవడానికి కేవలం నడక దారి మాత్రమే ఉండేది. 1943లో మొదటి ఘాట్ రోడ్‌ను, 1979లో రెండో ఘాట్ రోడ్‌ను నిర్మించింది టీటీడీ. ఘాట్‌రోడ్‌ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 1951లో రోజుకు సగటున 619 మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ ఏడాది మొత్తం 2 లక్షల 26 వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కలిగింది.
👉 1961లో రోజుకు సగటున 3,197 మంది, 1971లో రోజుకు 9,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 1981లో రోజువారీ దర్శనాల సంఖ్య ఏకంగా 21 వేల 786కి పెరిగింది. 1991లో రోజుకు 32 వేల 332 చొప్పున ఏడాది పొడవునా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి 18 లక్షలు దాటేసింది.
👉 2001లో రోజుకు 65 వేల మంది, 2011లో 70 వేల చొప్పున స్వామిని దర్శించుకున్నారు. 2021లో కోవిడ్ ఇయర్ కావడంతో భక్తుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత కాలంలో మళ్లీ పెరిగింది.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు క్యూ లైన్ విధానంలో, వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది.
👉 1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2001లో రెండో క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఈ రెండు కాంప్లెక్స్‌లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో 2014లో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది.
👉 2019లో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చింది. 2024 నాటికి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లను పెంచింది. ఇలా క్యూ లైన్‌లోనే 65 వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినా..స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటల పైబడి వేచి ఉండే సమయాలు ఏడాదికి 100 రోజులు పైగానే ఉన్నాయి.
👉 స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చింది టీటీడీ. మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలో కుల శేఖర పడి వరకు అనుమతించేవారు. అప్పట్లో రోజుకు 20 వేల మంది వరకు మాత్రమే దర్శించుకోగలిగేవారు.
👉 1983లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించేవారు. దీంతో రోజుకు 40 వేల మందికి దర్శనభాగ్యం లభించేది. 2005లో తెచ్చిన మహాలఘు దర్శన విధానంలో జయ విజయల గడప నుంచి రోజుకు 90 వేల నుంచి లక్ష మంది భక్తులు..స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. మరోవైపు బంగారు వాకిలిలో మూడు క్యూ లైన్‌ల విధానాన్ని 2014లో ప్రవేశపెట్టారు. దీంతో బంగారు వాకిలి లోపల భక్తులు తోపులాట లేకుండా స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభించింది.