ప‌ర్యాట‌క రంగంలో ప్రభుత్వ – ప్రైవేటు పెట్టుబడులు !

👉 శనివారం ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని...

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన !

J SURENDER KUMAR,

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఆ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా సంకల్పించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.

👉 ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని శనివారం హైద‌రాబాద్ శిల్పారామం వేదిక‌గా నిర్వ‌హించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌ – 2025లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నూతన ప్రాజెక్టులను ఆవిష్క‌రించ‌నున్నారు.

👉 తెలంగాణ టూరిజం పాలసీని ఆవిష్కరించిన నేపథ్యంలో పలు సంస్థలు రాష్ట్రంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన హోట‌ళ్లు, వెల్‌నెస్ సెంట‌ర్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. టూరిజం కాంక్లేవ్ లో  పర్యాటక శాఖ చేపట్టనున్న పలు కార్యక్రమాలతో పాటు నూతన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి  ఆవిష్కరిస్తారు.

👉 ప్రధానంగా అనంత‌గిరి కొండ‌ల్లో జాయ్‌సన్ – మేఘా సంస్థ సంయుక్త భాగ‌స్వామ్యంతో అత్యాధునిక వెల్‌నెస్ సెంట‌ర్, ద్రాక్ష నుంచి వైన్ త‌యారీ యూనిట్‌, అట‌వీ ప్రాంతంలో తాజ్ స‌ఫారీ, మ‌హింద్రా కంపెనీ ఆధ్వ‌ర్యంలో వాట‌ర్‌ ఫ్రంట్ రిసార్ట్స్‌, ఫైవ్ స్టార్ హోట‌ల్స్‌, తెలంగాణ‌లో టైర్ 2 న‌గ‌రాల్లో జింజ‌ర్ హోటళ్లు, నాగార్జున సాగ‌ర్‌లో వెల్‌నెస్ రిట్రీట్‌ సెంటర్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులను ప్రకటించబోతున్నారు.

👉 బుద్ధ‌వ‌నాన్ని మ‌రింత ఆకర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన Fo Guang Shan సుముఖంగా ఉంది.  ముఖ్య‌మంత్రి  స‌మ‌క్షంలో ఈ సంస్థ‌లు ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఫ‌లితంగా రాష్ట్రానికి ,₹15 వేల కోట్లు పెట్టుబ‌డులు రావ‌డంతో పాటు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సుమారు 50 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంది.

👉చలన చిత్రాల నిర్మాణంలో ప్ర‌పంచ స్థాయి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. సినిమా నిర్మాణాలకు సంబంధించి ఈ పోర్టల్ ద్వారా సింగిల్ విండో అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఏఐ ద్వారా ద్వారా వివిధ లొకేషన్లలో షూటింగ్‌లకు తక్షణ అనుమతి లభిస్తుంది.

👉 వైద్యం కోసం ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో మెడికల్ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తున్నారు.

👉 హైదరాబాద్‌లోని ఆసుపత్రులు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, బీమా సౌకర్యం, వీసా జారీ, పొడగింపు వంటి సేవల వివరాలు పోర్టల్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఆయా దేశాల నుంచి వచ్చే వారికి భాషాపరమైన ఇబ్బందులు లేకుండా ట్రాన్స్‌లేటర్ల వివరాలను కూడా పొందుపరిచారు.

👉 తాజాగా హెలి టూరిజాన్ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతోంది. తొలుత హైద‌రాబాద్ నుంచి సోమ‌శిల అక్క‌డి నుంచి శ్రీశైలం వ‌ర‌కు హెలికాఫ్ట‌ర్ సేవ‌లు ప్రారంభించనున్నారు. ప‌ర్యాట‌కుల ఆద‌ర‌ణ ఆధారంగా తదుపరి  దానిని మ‌రింత‌గా విస్త‌రిస్తారు.

👉 వైవిధ్యమైన తెలంగాణ వంటలు.. హైదరాబాద్ బిర్యాని, సర్వపిండి, సకినాలు వంటి ప్రత్యేక వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రాంతాల వారిగా ఆయా వంటలకు సంబంధించిన మ్యాప్ తయారు చేశారు.

👉 తెలంగాణ‌ను సంద‌ర్శించే ప్ర‌తి ప‌ర్యాట‌కుడికి సరైన భ‌ద్ర‌త క‌ల్పించడం ప్రధాన ఎజెండాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు రైళ్లు, బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించి ఐఆర్సీటీసీ, ఇతర ట్రావెల్ సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందం చేసుకోనుంది.

👉 పర్యాటకుల కోసం డిజిటల్ టూరిజం కార్డులను కూడా అందుబాటలోకి తేనున్నారు. ఈ కార్డును రీచార్జీ చేసుకోవడం వల్ల వివిధ ఆలయాలు, రవాణా వాహనాలు, హోటళ్లలో రాయితీలు వంటి అదనపు సౌకర్యాలు అందుతాయి.

👉 పర్యాటక రంగంలో అందించే సేవల ఆధారంగా హోటళ్లు, ఇతర సంస్థలకు ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేయనుంది. హుస్సేన్ సాగ‌ర్‌లో 120 సీట్ల సామ‌ర్థ్య‌మున్న ముచుకుందా డ‌బుల్ డెక్క‌ర్ బోట్‌ను ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంది.