👉 అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది !
J.SURENDER KUMAR,
సేవే నిజమైన సంపద అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.
శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. శ్రీ అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు.

ఆయన ప్రవేశపెట్టిన ‘ఒక ఇటుక, ఒక నాణెం’ సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్ అని పేర్కొన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితం చేయకుండా, సమాజంలో పంపిణీ చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు.
సమ్మిళిత వృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక న్యాయం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే అందుకు ఆయన వేల ఏళ్ల కిందట వేసిన మార్గమే కారణమన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ శ్రీ అగ్రసేన్ మహారాజ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించారు.
కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.