సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు !

👉 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను…

J SURENDER KUMAR,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

👉 సింహ వాహనం – ధైర్య‌సిద్ధి !

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. 

సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో  ముర‌ళి కృష్ణ‌ తదితరులు పాల్గొన్నారు.

👉 భక్తులకు మెరుగైన వైద్య సేవలు !


 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద తెలిపారు.

తిరుమలలోని రామ్ భగీచా-2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో అశ్వినీ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారితో కలిసి శుక్రవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.

50 మంది డాక్టర్ లు 60 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారని తెలిపారు. తిరుమలలో సాధారణ రోజుల్లో 10 అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని, బ్రహ్మోత్సవాలకు అదనంగా 4 అంబులెన్స్ లను భక్తులకు అత్యావసర వైద్యం అందించేందుకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.

మాడ వీధుల్లోని 4 కార్నర్లలో ఒక్కో అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని, వాహన సేవ వెనుక మరో అంబులెన్స్ ఉంటుందని తెలిపారు. గరుడసేవ రోజున మాడవీధుల్లోని కార్నర్లలో 20 మంది సీనియర్ డాక్టర్లు,20 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు వైద్యం అందిస్తారని పేర్కొన్నారు.


2 బ్యాటరీ వాహనాల ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈసారి బ్రహ్మోత్సవాల్లో సీనియర్ సిటిజన్ల షెడ్డు వద్ద 12 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న 12 డిస్పెన్సరీలతో పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అదనంగా ముఖ్యమైన ప్రాంతాల్లో 10 డిస్పెన్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.