శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన  సీఎం చంద్రబాబు నాయుడు !

J.SURENDER KUMAR,

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో బుధవారం  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ముందుగా  శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్  బీ.ఆర్.నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. 

ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు ముఖ్యమంత్రి కి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా 2026 ఏడాది టిటిడి డైరీలు, క్యాలెండర్లను గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆవిష్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సి.పి.  రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులలో జేఈవో 
వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో  మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 👉 వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం !


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కంకణ బట్టర్  వేణుగోపాల దీక్షితులు, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.