👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J . SURENDER KUMAR,
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదే విధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలు రాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేం ఈ రోజు పరిపాలన చేస్తున్నాం మన సీఎం స్పష్టం చేశారు.
👉 నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
👉 తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆవిష్కృతమైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి సాధించుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసిన వారిగా మిగిలిపోతామని అన్నారు.
👉 “తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. అందుకు అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం. ఎజెండాలు, జెండాలు పక్కన పెట్టి ప్రభుత్వం ప్రణాళికా బద్ధం చేస్తున్న అభివృద్ధిలో కలిసిరండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది

👉 ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తాం. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, అందుకు మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఉండాలి” అని ప్రజాపాలన దినోత్సవ వేదిక నుంచి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
👉 “నిజాం నిరంకుశ పాలనపై జరిగిన పోరాటంలో 1948, సెప్టెంబర్ 17న ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛా పతాకను ఎగుర వేసిన రోజు. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
👉 అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం.
👉 విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం. గొప్ప విజన్‌తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం. భవిష్యత్‌లో తెలంగాణ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి. విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు. భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం.
👉 మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్, మహిళా మార్ట్ లు అందుకు నిదర్శనం.
👉 హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, ₹ 20,616 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం.
👉 రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో ₹ 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు.
👉 ప్రజా ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశాం. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం.
👉 భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. అందుకే భూ భారతి చట్టం తెచ్చాం. క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఇటీవలే 5 వేల మంది గ్రామ పాలనా అధికారులను నియమించాం.
👉 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్లలో చూసిన ఆనందం నాకు ఎనలేని తృప్తినిచ్చింది.

👉 సన్నబియ్యం సంక్షేమ పథకానికి ఈ రోజు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మందికి నిత్యం సన్నబియ్యంతో ఈ రోజు భోజనం చేయగలుగుతున్నారు.
👉 కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ జీవనాడులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరేలా వ్యూహరచన చేస్తున్నాం.
👉 ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేం మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నాం. రోడ్లు, విద్యుత్, రహదారులు, రవాణా సదుపాయాలు, మురుగు నీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్నీ కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను మార్చాలి. లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
👉 మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతం నైట్ ఎకానమీ కొనసాగించేలా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే మూసీ పునరుజ్జీం కోసం రూపొందించనున్న ప్రణాళికలను 2025 డిసెంబర్ 9 న ఆవిష్కరిస్తాం.
👉 ఓఆర్‌ఆర్‌పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది. ₹ 24 వేల కోట్ల రూపాయల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది.
👉 రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా నిలబడనున్న 360 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు అనుగుణంగా రీజినల్ రింగ్ రైల్ కోసం కేంద్రం దాదాపుగా అంగీకరించింది. గ్రీన్ ఫీల్డ్ హైవే తో పాటు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై బుల్లెట్ ట్రెయిన్ అడుగుతున్నాం.
👉 ఏ గ్రామమైనా, జిల్లా అయినా, రాష్ట్రం, దేశం ముందుకు వెళ్లాలంటే ప్రణాళికలు అవసరం. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. డిసెంబర్ 9 న రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తాం.
👉 ఈ సంకల్ప పత్రాన్ని కార్యచరణలో పెట్టి 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం. మా సంకల్పానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలి. సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం… ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలి. ఆ బాధ్యత మాది. అందుకు ప్రజల సంపూర్ణ సహకారం కావాలి..” అని అన్నారు.
👉 ఈ ప్రజా పాలన దినోత్సవ వేడుకలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ జితేందర్ తో పాటు ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.