J.SURENDER KUMAR,
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా అమెజాన్ ఇండియా సంస్థ మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రకటించింది. రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, వివిధ వర్గాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది.
న్యూఢిల్లీలో పీఏఎఫ్ఐ (PAFI) వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులను అన్వేషించడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్యకలాపాలను విస్తరించాలని వారికి సూచించారు.
👉 ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) చేతన్ కృష్ణతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమెరికా వెలుపల అమెజాన్‌కు అతిపెద్ద గ్లోబల్ కేంద్రాలలో తెలంగాణ ఒకటిగా ఉందని గుర్తు చేస్తూ, రాష్ట్రంతో తన నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పింది.

👉 అమెజాన్ ప్రకటించిన మూడు కార్యక్రమాలు:
👉 SME ఎగుమతిదారులకు మద్దతు:
గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ద్వారా తెలంగాణలోని చిన్న, మధ్య తరహా వ్యాపార విక్రేతలను ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఎగుమతులు పెరుగుదల, వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది.
👉 మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత:
అమెజాన్ సంస్థ కళాకార్ (Kalakar) కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది మహిళా సాధికారతకు, ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది.
👉 గిగ్ వర్కర్ల సంక్షేమం:
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో 100 విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో అన్ని ప్లాట్‌ఫామ్‌ల గిగ్ వర్కర్లకు పార్కింగ్, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు, ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తారు.