👉 టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ!
J.SURENDER KUMAR,
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టీటీడీ ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ పూర్వపు ఈవో శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబెర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియో గా కూడా ప్రమాణం చేశారు. వీరితో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈఓ కు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ…
టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
మొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 వరకు – మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు.
దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామనీ, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవోను చైర్మన్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
👉 టీటీడీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఈవో !
టీటీడీ ఈవోగా పని చేసి బదిలీపై వెళ్లిన టీటీడీ పూర్వపు ఈవో జె.శ్యామలరావు తనకు విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల పాటు స్వామివారి అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.