టిటిడిలో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలం !

👉 బదిలీపై వెళ్తున్న ఈవో శ్రీ జె. శ్యామలరావు !


J.SURENDER KUMAR,

టిటిడిలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని టిటిడి నుండి బదిలీపై వెళ్తున్న ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది.

👉 ఈ సందర్భంగా  జె. శ్యామల రావు మాట్లాడుతూ…

తన కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు.  టిటిడి అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి, లోపాలను సవరించుకుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు.

వచ్చే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చామన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషితో  భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ లకు టిటిడి ఈవోగా పనిచేయాలని ఉంటుందని, తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని,  అనుకోకుండా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు  తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి కి, తనకు సహకరించిన టిటిడి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. 


👉 టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ,


ఏడాది కాలంలో చాలా సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. చాలా జఠిల సమస్యలను కూడా సమిష్టిగా హ్యాండిల్ చేసేందుకు శ్యామలరావు చేసిన కృషి మరువలేనిదన్నారు. శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు తయారీ, పంపిణీ,  అన్నప్రసాదాల వితరణ, వసతిపై చాలా సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ విధానం ద్వారా అన్నప్రసాదాల పంపిణీలో భక్తుల నుండి 96 శాతం సంతృప్తి వ్యక్తం చేసేందుకు శ్యామలరావు కృషి చాలా ఉందన్నారు. ఐవీఆర్ఎస్ విధానం, వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానం, శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, సదరు అభిప్రాయాలను అంతటిని క్రోడీకరించి లోపాలను సవరించుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శ్యామల రావు కృషి అభినందనీయం అన్నారు.

👉 టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ,


టిటిడిలోని ఐటీ విభాగంలో సమూల మార్పులను  శ్యామల రావు తీసుకువచ్చారన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాలు, ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం, అమరావతిలో శ్రీనివాస కల్యాణం తదితర కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించి విజయవంతం చేశారన్నారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.

👉 టిటిడి సివిఎస్వీ మురళీకృష్ణ మాట్లాడుతూ,


టిటిడిలో భద్రతాపరంగా ప్రత్యేక దృష్టి పెట్టి భక్తులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారన్నారు. టిటిడిలో దళారి వ్యవస్థను కట్టడి చేసేందుకు విజిలెన్స్ విభాగాన్ని నిత్యం పర్యవేక్షించారన్నారు.

👉 టిటిడి ఎఫ్ ఏ సీఏవో  ఓ. బాలాజీ మాట్లాడుతూ,


టిటిడిలో కియోస్క్ యంత్రాలను తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ విధానం టిటిడిలో తొలిసారి అమలు చేశారన్నారు.

👉 టిటిడి సీఈ టివి సత్యనారాయణ మాట్లాడుతూ,

టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి పనులను బట్టి విభజించి  మరింత నాణ్యంగా చేపట్టేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇంజనీరింగ్ పనులలో లెటేస్ట్ టెక్నాలజీని తీసుకువచ్చి పనులలో మరింత నాణ్యత ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, తిరుమల రాక పోకల రోడ్లు, పర్యావరణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర ఇంజనీరింగ్ పనులపై సైంటిఫిక్ గా ఆలోచించి మెరుగైన అభివృద్ధి పనులను చేశారన్నారు.

సన్మాన సభ ప్రారంభానికి ముందు  బదిలీపై వెళ్తున్న ఈవో  జె. శ్యామలరావుకు  శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు.