వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారికి తక్షణ సహాయం చేయండి!

👉 కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ !

J.SURENDER KUMAR,

వరదల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

👉 భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో తలెత్తిన పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో వాటిల్లిన న‌ష్టాల‌పై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర  స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి  ఉన్నత స్థాయి స‌మీక్ష, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

👉 ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న రోడ్లు, భ‌వ‌నాలు, చెరువులు, కుంట‌లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డంతో పాటు విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల పున‌ర్నిర్మాణం ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విప‌త్తు ఉప‌శ‌మ‌న నిధులు (SDRF) నిధులున్నా నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటిని వ్య‌యం చేయ‌డంలో అల‌స‌త్వం చూప‌డంపై అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

👉 గ‌తేడాది ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లో వ‌ర్షాల‌తో వాటిల్లిన తీవ్ర నష్టానికి కేంద్రం నుంచి రావలసిన స‌హాయం అంద‌క‌పోవ‌డంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి  ఆ వివరాలతో పాటు ప్రస్తుత వరదల నష్టానికి సంబంధించిన వివరాలతో సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క  నేతృత్వంలోని బృందం ఈ నెల 4 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ఆ రెండు నివేదికలకు అంద‌జేస్తుంద‌ని చెప్పారు.

👉 వ‌ర‌ద‌ల‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 257 చెరువులు, కుంట‌ల‌కు గండి పడినట్టు అధికారులు చెప్పగా, ముఖ్యమంత్రి  స్పందిస్తూ, చిన్న నీటి పారుద‌ల విభాగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, ఆర్ఆర్ఆర్‌, ప్ర‌ధాన‌మంత్రి కృషి సంచాయ్ యోజ‌న‌, ఇత‌ర కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ను వినియోగించుకొని చిన్న నీటి వ‌న‌రుల‌కు మ‌ర‌మ్మ‌తులు, పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు.

👉 గ‌తంలో నీటి వినియోగ‌దారుల సంఘాల ఆధ్వ‌ర్యంలో చెరువులు, కుంట‌లు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూట‌రీల వారీగా సంఘాలు ఉండేవి. ఆ సంఘాల‌కు సంబంధించిన నిబంధ‌న‌లు ప‌రిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   ఆధ్వ‌ర్యంలో స‌మావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు నూత‌న ప్ర‌తిపాద‌న‌ల‌తో నివేదిక స‌మ‌ర్పించాల‌ని, దానిపై  మంత్రివ‌ర్గంలో చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

👉 82 మండ‌లాల్లో 2.36 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింద‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనాలపై స్పందిస్తూ రెండు రోజుల్లో పూర్తి వివ‌రాల‌తో స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ‌తామ‌ని చెప్పారు.

👉 నీట మునిగిన స‌బ్ స్టేష‌న్ల స్థానంలో అధునాత‌న సామ‌గ్రి, సామ‌ర్థ్యంతో కూడిన స‌బ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని విద్యుత్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, జీహెచ్ఎంసీ ప‌రిధిలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష నిర్వ‌హించి ప‌రిష్కారంతో రావాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ‌కృష్ణారావు కు సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్, తాగునీటి స‌ర‌ఫ‌రా, ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ‌లు కూడా రెండు రోజుల్లో స‌మ‌గ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.

👉 కామారెడ్డి, ఆదిలాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల‌, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి అక్క‌డి ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. స‌హాయ‌క ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని, ప‌రిహారాలు వెంట‌నే విడుద‌ల చేయాల‌న్నారు.

👉 అన్ని శాఖ‌లు ఎస్డీఆర్ఎఫ్ నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించ‌డంతో పాటు స‌కాలంలో వినియోగితా ప‌త్రాలు (యూసీ) స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి  స్పష్టం చేశారు. విప‌త్తు స‌మయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ ద‌ళాలు వ‌ర‌ద‌ల స‌మ‌యంలో మెరుగైన సేవ‌లు అందించాయని అభినంద‌న‌లు తెలిపారు.

👉 భారీ వ‌ర్షాల స‌మ‌యంలో 42 ఆప‌రేష‌న్ల‌లో పాల్గొని 217 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించ‌డంపై ముఖ్య‌మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సిబ్బందికి మ‌రింత మెరుగైన శిక్ష‌ణ‌, నైపుణ్యాలు అందేలా చూడాల‌ని రాష్ట్ర అగ్నిమాప‌క, విప‌త్తు స్పంద‌న, పౌర స‌హాయ‌క విభాగం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కు సూచించారు.

👉 వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో మార్పులు, మున్ముందు అకాల వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ఎక్కువ‌గా వ‌చ్చే ప్ర‌మాదం ఉన్నందున జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పాటు విప‌త్తుల స‌మ‌యంలో త‌క్ష‌ణ‌మే క్షేత్ర స్థాయికి వెళ్లి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని ముఖ్యమంత్రి  ఆదేశించారు.

👉 ప్ర‌స్తుతం వ‌ర్షాల‌కు తీవ్రంగా దెబ్బ‌తిన్న జిల్లాల్లో ప‌నుల‌కు కంటింజెన్సీ కింద క‌లెక్ట‌ర్ల‌కు ₹10 కోట్లు, సాధార‌ణ న‌ష్టం వాటిల్లిన జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ₹ 5 కోట్ల చొప్పున నిధులు విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.