👉 అరాచకాల రజాకార్ నాయకుడు కాశీం రజ్వీ !
👉 కాశీం రజ్వీ న్యాయవాది !
👉 నేడు విలీన, విమోచన దిన సందర్భంగా…..
J.SURENDER KUMAR,
నిజాం రాజ్యం చివరి దశలో ఎక్కువగా వినిపించిన రెండు పేర్లు, ఏడో నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరొకరు తెలంగాణలో అరాచకాలు సృష్టించిన రజాకార్ నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోట పై నిజం జెండా ఎగురవేయాలనుకున్న వ్యక్తి కాసిం రాజ్వి. సామాన్య న్యాయవాదిగా మొదలైన రజ్వీ, భారత యూనియన్‌లో సంస్థానాల విలీనం కొనసాగుతున్న సమయంలో ‘రజాకార్’ నాయకుడిగా మారారు. నల్లకోటు విడిచి మిలటరీ జనరల్ దుస్తులను ధరించారు.
కాశీం రజ్వీ ప్రయాణాన్ని ఆయన సమకాలీన నాయకులు, చరిత్రకారులు భిన్నమైన దృష్టికోణాల్లో చూశారు. అయితే, ఆయన చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలు హింసకు పురిగొల్పి అసంఖ్యాక ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమై హైదరాబాద్ సంస్థానాన్ని పతనం అంచున నిలబెట్టాయన్న అంశంపై వారి రచనల్లో ఏకాభిప్రాయం కనిపిస్తుంది.
👉 ‘హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు ఉపక్రమిస్తే దిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీల (నిజాం రాజుల) జెండా ఎగరేస్తాం. బంగాళాఖాతం నీళ్లు నిజాం పాదాలను అభిషేకిస్తాయి”.. ఇలా కాశీం రజ్వీ ప్రసంగాలు సాగేవని చరిత్రకారులు రాశారు.
👉 వివాదాస్పద వ్యక్తి !
‘దక్కన్ ప్రాంత చరిత్రలోనే ఆయన (కాశీం రజ్వీ) వివాదాస్పద వ్యక్తి’ అని అనాటి భారత యూనియన్ రాష్ట్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి వీపీ మేనన్ తన ‘ది స్టోరీ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్’ అన్న పుస్తకంలో రాశారు.
“నైజాం చేతిలో రజ్వీ ఒక పరికరం. ఎట్లా ఆడిస్తే అట్లా ఆడిన కీలుబొమ్మ. నిజాం తానే స్వయంగా ప్రోత్సహించి రజాకార్ల పేరుతో ప్రైవేట్ సైన్యం ఏర్పడేందుకు అవకాశం కల్పించాడు” అని అనాటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామానంద తీర్థ తన పుస్తకం హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం: అనుభవాలు-జ్ఞాపకాలు (పేజీ 261)లో అభిప్రాయపడ్డారు.
👉 స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానం !
భారత ప్రభుత్వ స్వాతంత్ర్య చట్టం ప్రకారం.. 1947 ఆగష్టు 15న బ్రిటిష్ పాలన ముగిశాక హైదరాబాద్ సంస్థానం భారత్, పాకిస్తాన్ లలో కలవబోదని, స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని నిజాం ప్రకటించారు. నిజాం రాజ్యం సొంత సైన్యం, రవాణా, రైల్వే, విమాన, పోస్టల్, కరెన్సీ, టెలిగ్రాఫ్ సర్వీసులు నిర్వహించేది.
భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం, రక్షణ కారణాల రీత్యా నిజాం రాజ్యం తనలో విలీనం అవ్వాలని భారత యూనియన్ పట్టుబట్టింది. చర్చల ద్వారా పరిష్కారం జరగాలని, దానికోసం ఏడాది కాలం పాటు ‘యధాతథ స్థితి’ కొనసాగించాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.
👉 రజ్వీ కుమారులు రజాకారులే…
హైదరాబాద్ రాజ్య ముస్లింలలో ఐక్యత కోసం ఎంఐఎం (మజ్లిస్-ఎ- ఇత్తేహాదుల్ ముస్లిమీన్) ఏర్పాటైందని చెబుతారు. దీన్నే ‘ఇత్తేహాద్’ అని పిలిచేవారు.
నిజాం రాజ్యంలోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్రలో భాగం) లో న్యాయవాదిగా పని చేస్తున్న కాశీం రజ్వీ, యధాతథ స్థితి ఒప్పందానికి ముందే ‘ఇత్తేహాద్’ అధ్యక్షునిగా ఎన్నికై తన మకాం హైదరాబాద్ కు మార్చారు. ఈ సంస్థలో రజాకార్లు ఒక విభాగం. రజాకార్ అంటే వలంటీర్ అని అర్థం. ఈ రజాకార్ల సహాయంతో రజ్వీ హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని చరిత్రకారులు రాశారు.
👉 రజ్వీ తన సొంత కొడుకులు ఇద్దరిని రజాకార్ల బెటాలియన్ లో చేర్చారని నిజాం రాజ్యం చివరి ప్రధాని మీర్ లాయక్ అలీ రాసిన ‘ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ పుస్తకంలో పేర్కొన్నారు. ( హైదరాబాద్ విషాదం- పేజీ-289)
👉 “రజాకార్లకు కులం, మతం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్తులు కూడా ఇందులో చేరారు. ఈ బృందంలో ముస్లింల తిరుగులేని ఆధిక్యం వల్ల రజాకార్లంటే ముస్లింలు అన్న అర్థమే స్థిరపడిపోయింది” అని నిజాం రాజ్య చివరి ప్రధాని మీర్ లాయక్ అలీ తన పుస్తకం ‘ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ లో వివరించారు. (హైదరాబాద్ విషాదం పేజీ 106)
👉 నిజాం పై రజ్వీ ప్రభావం చూపించారా ?

తక్కువ సమయంలోనే నిజాం, అతని ప్రభుత్వ యంత్రాంగంపై కాశీం రజ్వీ తన ప్రభావాన్ని చూపారన్న అభిప్రాయాలున్నాయి.
ప్రధాన మంత్రిగా మీర్ లాయక్ అలీ నియామకంలోనూ రజ్వీపాత్ర ఉందని, దీంతో నిజాం ప్రభుత్వం రజ్వీ నియంత్రణలోకి వచ్చిందని వీపీ మేనన్ తన రచనలో పేర్కొన్నారు.
👉 ‘‘హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించేది తానేనని అతను నిస్సందేహంగా భావించారు. హైదరాబాద్ తన స్వాంతంత్ర్యాన్ని ఎప్పటికీ వదులుకోదని, విలీనం, ప్రజాభిప్రాయ సేకరణకు పట్టుబడితే తుది మధ్యవర్తి కత్తి మాత్రమే అని రజ్వీ అన్నారు. అతని బాధ్యతారాహిత్య వైఖరి అతనితో పాటూ నిజాంను విపత్తులోకి నెట్టివేస్తుందని అతనికి చెప్పాను” అని మేనన్ రాశారు. (‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటెగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్-వీపీ మేనన్-పేజీ 318 )
👉 సామాన్యులపై దాడుల్లో ప్రభుత్వ యంత్రాంగం రజాకార్లకు సహకరించిందని రామానంద తీర్థ లాంటి ఆనాటి నిజాం స్టేట్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
👉 కాశీం రజ్వీ రజాకార్ల వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారా ?
రజాకార్ల చర్యలు పాలన, భారత దేశంతో సంబంధాలను ఇరకాటంలో పడేశాయని నిజాం ప్రభుత్వంలో పనిచేసిన ఆనాటి కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.
‘అపరేషన్ పోలో’ సమయంలో నిజాం సివిల్ సర్వీస్ అధికారి మొహమ్మద్ హైదర్ ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన భారత ప్రభుత్వ విచారణ ఎదుర్కొన్నారు. ఆనాటి అనుభవాలను డైరీల్లో నిక్షిప్తం చేశారు. అక్టోబర్ కూప్: ఎ మెమోయిర్ ఆఫ్ ది స్ట్రగుల్ ఫర్ హైదరాబాద్ ( తెలుగు అనువాదం:1948- హైదరాబాద్ పతనం’ ) పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి.
👉 ”రజాకార్లతో ప్రభుత్వ శాంతి భద్రతల విభాగానికి ఎలాంటి మేలుగానీ, సహాయం కానీ లేదు. రజాకార్లకు అనవసర ప్రాముఖ్యాన్నిచ్చారు. వారి బాధ్యతారాహిత్య ప్రసంగాలు క్షేత్ర స్థాయిలో మా పనిని కష్టసాధ్యంగా మార్చాయి. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందనుకుంటే రజాకార్ సంస్థను రద్దు చేయడానికీ తాను సుముఖంగా ఉన్నట్లు రజ్వీ కనిపించాడు” (పేజీ 68, 79)
👉 “మతపరమైన ఆవేశంలో ఆయన ప్రణాళికను అమలుచేయడానికి సిద్దపడ్డారు. కొన్ని దూకుడు సంఘటనల వల్ల రజాకార్లంటే కోపం, భయం ఏర్పడింది. అర్ధ మిలటరీ సంస్థ అయిన రజాకార్ల లాంటి సంస్థతో భవిష్యత్తులో ఏర్పడబోయే దుష్పరిణామాల పట్ల కూడా ఆయనకు అవగాహన ఉంది. పరిస్థితులు అనుకూలించగానే దాన్ని రద్దు చేయాలని కూడా అనుకున్నారు” అని తన పుస్తకంలో మీర్ లాయక్ అలీ రాశారు. (‘ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్’ (‘హైదరాబాద్ విషాదం’ (పేజీలు- 105-110 )
👉 ఆపరేషన్ పోలో- రజ్వీ అరెస్ట్ !
1948 సెప్టెంబర్ 13-17ల మధ్య జరిగిన ఆపరేషన్ పోలో చర్యతో హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది.
👉 బీబీ నగర్ దోపిడి, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ హత్య కేసుతో పాటు మొత్తం మూడు అభియోగాలు కాశీం రజ్వీపై మోపారు. విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటైంది.
లాయర్ అయిన కాశీం రజ్వీ ట్రిబ్యునల్ ముందు తన వాదనలు స్వయంగా వినిపించారు.
👉 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. బీబీ నగర్ డెకాయిటీ కేసులో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జర్నలిస్టు షోయబుల్లా హత్య కేసులో జీవిత ఖైదు పడింది.
👉 హైకోర్టు అప్పీల్‌లో జీవిత ఖైదు రద్దైంది.
విచారణలో రెండేళ్లు, శిక్ష 7 ఏళ్లు ఇలా మొత్తం 9 ఏళ్లు చంచల్ గూడ, ఎరవాడ జైళ్లలో కాశీం రజ్వీ శిక్ష అనుభవించారు.
1957 సెప్టెంబర్ 11న రజ్వీ విడుదలయ్యారని చరిత్రకారుడు నరేంద్ర లూథర్ రాశారు.
👉 రజ్వీ పాకిస్తాన్ ప్రయాణం
ఎరవాడ జైలు నుండి నేరుగా హైదరాబాద్ కు వచ్చి ‘ఇత్తేహాద్’ పగ్గాలను అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించారు. పాత నేరస్తునిగా తాను ప్రాక్టీస్ చేయలేనని, జీవితం గడపడం కష్టమని, అందువల్ల తాను పాకిస్తాన్ వెళ్లిపోతున్నానని పత్రికా సమావేశంలో రజ్వీ ప్రకటించారు. (హైద్రాబాద్ జీవిత చరిత్ర- నరేంద్ర లూథర్. పేజీ- 358)
👉 పాకిస్తాన్ లో రజ్వీ శేషజీవితం !
కాశీం రజ్వీ తన శేషజీవితాన్ని కరాచీలో గడిపారు. అక్కడ సామాన్య జీవితాన్ని సాగించారని ఆయన మనవరాలు అతియా ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
”పాకిస్తాన్ ప్రజా జీవితంలో చురుకైన పాత్రపోషించాలని ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి. ప్రధానమంత్రి పదవి, ముస్లిం లీగ్ పగ్గాలు చేపట్టాలని కోరారు. రాజకీయ పదవులపై ఆయన మనసు విరిగిపోయింది. తన జీవనం కోసం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకున్నారు. ప్రశాంత జీవితం గడపాలనుకున్నారు” అని తన ఇంటర్వ్యూలో అతియా ఖాన్ చెప్పారు.
👉 ( B.B.C న్యూస్ సౌజన్యంతో )