J.SURENDER KUMAR,
హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు కేంద్రమైన రాయదుర్గం ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా టీ-స్క్వేర్ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒక ఆకర్షణీయమైన కేంద్రంగా ఉండాలని, నవంబర్ నెలాఖరు నాటికి ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పారు.
👉 ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఏఐ హబ్, టీ-స్క్వేర్ తదితర అంశాలపై శనివారం సమీక్షించారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టీ-స్క్వేర్ ప్రాజెక్టుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
👉 టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనంలా ఉండాలని, అందుకు అనుగుణంగా డిజైన్, నిర్మాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. టీ-స్క్వేర్ డిజైన్ పర్యాటకులను ఆకర్షించడం, రెస్టారెంట్లు, వ్యాపారం వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.

👉 ఆ ప్రాంతం 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా ప్రదేశాన్ని తీర్చిదిద్దాలి. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలు, రంగురంగుల డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్‌ప్లే తో రూపొందించాలి. యాపిల్ లాంటి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు అక్కడ వ్యాపారం నిర్వహించేలా ఉండాలి.
👉 పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాహనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు ఉండాలి. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలతో పాటు కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా టీ-స్క్వేర్ రూపుదిద్దుకోవాలి.. అని చెప్పారు.
👉 హైదరాబాద్ లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న AI ప్రాజెక్టులు, స్టార్టప్‌లు, సెంటర్లను ఒకే చోట కలిపి, ప్రపంచ AI కంపెనీలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ హబ్‌లతో భాగస్వామ్యం చేసేందుకు ఈ హబ్ ఉపయోగపడాలని స్పష్టం చేశారు.