👉 మీడియా అకాడమీచైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి !
J SURENDER KUMAR,
కంటి నిండా నిద్దర లేకుండా, కడుపునిండా తిండి లేకుండా విధినిర్వహణలో భాగంగా నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
గురువారం దిల్ సుఖ్ నగర్ లోని లిఖిత డయాగ్నోస్టిక్ సెంటర్ లో, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో, జర్నలిస్టులకు నిర్వహించిన మెఘా హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు లేక పోవడంతో రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేసారు.

ఈ విషయాన్ని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టినట్లు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. రాష్ట్రంలో అకాల మరణం చెందుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా కొంతమేరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఆయా ఆసుపత్రుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే సంఘం అండగా నిలబడడం అభినందనీయమన్నారు.
👉మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ,

జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఎలాంటి జీత భత్యాలు లేకుండా శ్రమిస్తున్న జర్నలిస్టులు దీనస్థితిలో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో పిల్లలకు చదువులు, వైద్య ఖర్చులు వారికి మోయలేని భారంగా మారాయని ఆయన విచారం వ్యక్తం చేసారు.
ఆయా ప్రభుత్వాలు జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం సహించరానిదన్నారు. జర్నలిస్టుల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాజేందర్ కోరారు.
👉జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ…

జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోతుందని, ఆయా రాజకీయ పార్టీలు వారి అవసరాల కోసం జర్నలిస్టులను యూజ్ అండ్ థ్రోగా ఉపయోగించుకోవడం విచారకరమన్నారు. జర్నలిస్టుల కనీస అవసరమైన ఆరోగ్య భద్రతా పట్ల ఏ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లోనే తమ సంఘం ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందన్నారు.
ఇప్పటివరకు 10చోట్ల ఈ క్యాంపులను నిర్వహించి దాదాపు 4వేల మందికి ఆరోగ్యపరంగా సహకారాన్ని అందించినట్లు విరాహత్ అలీ స్పష్టం చేసారు. యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం పాషా అధ్యక్షతన ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు బుగ్గారపు దయానంద్, తెలంగాణ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ రంగ నర్సింహా గుప్తా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ, సీనియర్ నాయకులు రాధాక్రిష్ణ, ప్రవీణ్, నర్సింహా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
