ఆ శవం ఐదు సంవత్సరాలు గా అక్కడే ఉంది !

👉 జన్మభూమిలో దహనం కోసం ప్రయత్నాలు !

👉 సహాయం కోసం ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించిన మృతుడి సోదరుడు !

J.SURENDER KUMAR,

గల్ఫ్ కార్మికుల కష్టాలు కాదు, కర్కష హృదయులను సైతం కన్నీరు తెప్పిస్తున్న సంఘటన ఇది. కన్న కొడుకును కనులారా చూడకముందే జన్మనిచ్చిన తల్లిదండ్రులు మృతి చెందారు. సంతానం లేని తమకు తలకొరివి పెడతాడు అనుకొని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కూడా చనిపోయారు. గల్ఫ్ దేశంలో ఆస్పత్రి మార్చురీలో ఐదు సంవత్సరాలుగా అనాధ శవంగా ఉన్న తన రక్తం పంచుకొని పుట్టిన సోదరుడి మృతదేహం స్వగ్రామానికి తీసుకురావడానికి మృతుడి సోదరుడి ఆరాటం ఇది.

👉 వివరాలిలా ఉన్నాయి..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 18 ఏళ్ల క్రితం 2007లో  బతుకుదెరువు కోసం బెహరాన్ గల్ఫ్ గడ్డపై అడుగు పెట్టాడు. అక్కడ వివిధ పనుల్లో జీవనోపాధి కోసం శ్రమించారు ఓ దశలో కంపెనీ వదిలి అక్రమ వలసదారుడిగా మారినట్లు సమాచారం. మొదట్లో కుటుంబంతో సమాచార సంబంధాలు కొనసాగించినా, తరువాత పూర్తిగా సంబంధాన్ని కోల్పోయారు.


నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల స్వగ్రామం కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త ఇంటికి వస్తాడని  వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి తన భర్త శవమై రాబోతున్నాడు.


👉 ఆచూకీ తెలిసింది ఇలా..

బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం మంగళవారం  హైదరాబాద్ లో  ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వార చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

శ్రీపాద నరేష్ కుటుంబ కష్టకాలంలో మెట్‌పల్లి కి చెందిన గల్ఫ్ కార్మిక హక్కుల కార్యకర్త బొక్కెనపల్లి నాగరాజు, సామాజిక సేవకులు మాడిశెట్టి నాగరాజు, మొరపు తేజ లు మృతుడి సోదరుడి ద్వారా ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇప్పించారు.  తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి వారికి అండగా నిలిచారు. బహరేన్ లోని సోషల్ వర్కర్ కోటగిరి నవీన్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తు నరేష్ శవం స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.