J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలో ఈ నెల 11, 12 తేదీల్లో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.
ధర్మపురి శ్రీమఠం ప్రాంగణ మైదానంలో జరగనున్న ప్రవచన కార్యక్రమ సభావేదిక, పార్కింగ్ స్థలాలు, భక్తుల వసతి తదితర ఏర్పాట్లపై మంత్రి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమం ప్రశాంతంగా, ఎవరికి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా సాఫీగా, ఘనంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కొద్ది రోజుల క్రితం తాను కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు నివాసానికి వెళ్లి, ధర్మపురి క్షేత్రంలో ప్రవచన కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆయనను స్వాగతించానని మంత్రి తెలిపారు.
ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమ సభకు ధర్మపురి నియోజకవర్గంతో పాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని భక్తులు, ప్రజలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నా కుమారుడు హరిశ్వర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ” ధర్మపురి ఆలయ డాక్యుమెంటరీ ” ప్రోమోను, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చాగంటి కోటేశ్వరరావుచే విడుదల చేయనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 శ్రీశ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులను ఆహ్వానించనున్నాము !
ఈ నెల 19 న వేములవాడ ఆలయానికి, శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు రానున్నారని, 20 న ధర్మపురి క్షేత్రానికి రావాల్సిందిగా శ్రీ జగద్గురుల స్వామివారిని తాను స్వయంగా వెళ్లి ఆహ్వానించనున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.