ధర్మపురి ఆలయ ఉద్యోగి పట్ల చిందులు !

J SURENDER KUMAR,

వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, గుడిగంటలు, భక్తుల గోవింద నామస్మరణలతో  పవిత్రతకు, ప్రశాంతతకు ప్రత్యక్ష ప్రతిరూపం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి పట్ల స్థానిక  న్యాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగి చిరుబురు అంటూ చిందులు తొక్కుతూదుర్భాషలకు పాల్పడిన సంఘటన  ఆలస్యంగా వెలుగు చూసింది.

👉వివరాల్లోకి వెళ్తే…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారిని కలసి లేఖ ఇవ్వడానికి శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన స్థానిక న్యాయశాఖ ఉద్యోగి, ఒకరు ఆలయ అధికారిని అధికారి హోదాతో కాకుండా అతడి పేరుతో శ్రీనివాస్ ఉన్నాడా ? అంటూ సంబోధించినట్టు తెలిసింది. ( శ్రీనివాస్ పేరుతో  ఇద్దరు ఉద్యోగులు కొనసాగుతున్నారు. ఒకరు కార్య నిర్వహణ అధికారి, మరొకరు సీనియర్ అసిస్టెంట్ )

కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి ఒకరు కూర్చోండి ఛాంబర్ లో ఉన్నారు పిలుస్తాను అన్నారు. అర్జెంటుగా పిలవండి అంటూ న్యాయశాఖ ఉద్యోగి, ఆలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, మీరు కూర్చోండి సార్ అంటూ పదేపదే విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా, రెచ్చిపోయిన ఆ ఉద్యోగి నీ సంగతి ఎస్సైకి  చెప్పుతా, నీ మీద కేసు నమోదు చేస్తా, నిన్ను జడ్జి దగ్గరికి పిలుస్తా, నీ సంగతి చూస్తా అంటూ తనదైన శైలిలో ఆగ్రహంతో హెచ్చరించినట్టు సమాచారం.

దీంతో ఆలయ ఉద్యోగి మేమేం తప్పు చేశాం, ఎందుకు కేసు పెడతారు అంటూ వాదిస్తుండగా,  ఆలయ కార్య నిర్వహణాధికారి రావడంతో జరిగిన విషయం ఉద్యోగితో పాటు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కార్యనిర్వహణాధికారికి జరిగిన సంఘటన పూర్వపరాలు వివరించినట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకున్న కార్యనిర్వహణాధికారి మౌనంగా తన ఛాంబర్ లోకి జారుకున్నట్టు సమాచారం.

న్యాయవ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల, ఎనలేని గౌరవం, అపార నమ్మకం, విశ్వాసం, గల నేటి సమాజంలో ఆలయంలో జరిగిన ఉదాంతంపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని ఆలయ ఉద్యోగులు భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.