ధర్మపురికి కేంద్రీయ విద్యాలయ సంస్థ దక్కుతుందో ?  లేదో ?

J.SURENDER KUMAR,

జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం గ్రామీణ ధర్మపురి నియోజకవర్గానికి దక్కుతుందో ? లేదో ?  వేచి చూడాల్సిందే.
దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేస్తూ బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రాష్ట్రానికి కేటాయించిన నాలుగు విద్యాలయాల్లో ఒకదాన్ని జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు.

గతంలో జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం ధర్మపురి నియోజకవర్గం నేరెళ్లలో ఏర్పాటుకు దాదాపు 30 ఎకరాలభూసేకరణ, తాత్కాలిక భవనాన్ని, నాడు మంత్రి లక్ష్మణ్ కుమార్ జోక్యంతో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి, నవోదయ విద్యాసంస్థల ఉన్నతాధికారికి పంపించారు.

నేరెళ్ల గ్రామంలో త్వరలో ప్రారంభానికి నోచుకోనున్న నవోదయ విద్యాలయాన్ని కోరుట్లకు తరలించారు. నాడు ప్రభుత్వ విప్ హోదాలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఢిల్లీకి వెళ్లి  నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను, సంబంధిత కేంద్ర మంత్రి కలిసి తరలించవద్దని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇచ్చారు.

భవిష్యత్తులో కేంద్ర విద్యాసంస్థలు రాష్ట్రానికి కేటాయిస్తే ధర్మపురి నియోజకవర్గానికి న్యాయం చేస్తామంటూ ఎంపీ అరవింద్, సంబంధిత శాఖ కేంద్రమంత్రి మంత్రి లక్ష్మణ్ కుమార్ కు నాడు హామీ ఇచ్చారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో జగిత్యాల జిల్లాకు  తాజాగా కేంద్రీయ విద్యాలయం మంజూరు కావ డంతో  ధర్మపురి నియోజకవర్గ యువత, విద్యావేత్తలు, కేంద్రీయ విద్యా సంస్థ యోగం ధర్మపురికి దక్కుతుందో ? లేదో ? అనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.