ధర్మపురి పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు !

👉 హామీని అమలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. శనివారం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య, 38 ద్వారా,  ప్రభుత్వ కార్యదర్శి సీనియర్, ఐఏఎస్ అధికారి, డాక్టర్ యోగితా రాణా, ఉత్తర్వులు జారీ చేశారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని ధర్మపురి అసెంబ్లీ పరిధిలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెస్తానని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అనేక సమావేశాల్లో, సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించిన హామీ నేడు కార్యరూపం దాల్చింది.


👉 సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు !

ధర్మపురి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి  లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బడుగు, బలహీన, పేద విద్యార్థులకు డిగ్రీ  విద్యను అందుబాటులో తెచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు.

👉 ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని నియోజకవర్గం ధర్మపురి !

అసెంబ్లీ పునర్విభజనలో భాగంగా 2009 లో ఆవిర్భవించిన ధర్మపురి అసెంబ్లీ ( ఎస్సీ రిజర్వుడు ) నియోజకవర్గం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి, ఎండపెల్లి, ధర్మారం, మండలాలలో, బడుగు, బలహీన, వర్గాల విద్యార్థులు డిగ్రీ విద్య అభ్యసించడానికి ఇతర పట్టణాలకు, లేదా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చేరేవారు. పట్టణాలలో ప్రైవేటు కళాశాలలో విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరంగా వెనుకబడిన పేద విద్యార్థులు, ఇంటర్మీడియట్ తోనే విద్యను ఆపేవారు.

2009 ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పోటీ చేస్తూ వరుసగా 2014, 2018 లో ఓటమి చెందిన లక్ష్మణ్ కుమార్, ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ ఇచ్చేవారు. 2023 ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్నారు.

👉 డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం జారీ చసిన ఉత్తర్వులు !

👉 తెలుగు కళాశాలను పున ప్రారంభించారు !

ధర్మపురి పట్టణంలో దశాబ్దాల చరిత్ర గల శ్రీ లక్ష్మీనరసింహ తెలుగు సంస్కృత ఆంధ్ర కళాశాల ( నైట్ కాలేజ్ )  గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధుల కొరతతో సంవత్సరాల తరబడి మూత పడింది. ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, మంత్రి శ్రీధర్ బాబుతో  ధర్మపురి క్షేత్రంలో తెలుగు కళాశాల అవసరం, పగలు ఏదో ఉపాధి పనులు చేసుకుంటూ, యువతకు రాత్రి విద్య అభ్యసించే  వెసులుబాటు నైట్ కాలేజీలో ఉందని, తెలుగు, సంస్కృత, భాష పండితుల అవసరాలను కళాశాల పూర్వవైభవం, ఈ కళాశాలలో చదివిన వందలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న ఉదంతాలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వానికి వివరించారు.


కళాశాల లో మౌలిక సదుపాయాల కోసం తన ఎమ్మెల్యే నిధుల నుంచి  ₹ 5 లక్షల రూపాయలు కేటాయించారు. తాత్కాలిక విద్యాబోధన సిబ్బందిని నియమించారు. వారి జీతభత్యాలకు ప్రముఖ ఆలయాల నుండి నిధులు కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేయించి గత రెండు సంవత్సరాల క్రితం తెలుగు కళాశాలను తెరిపించారు.

ఈ విద్యా సంవత్సరం నైట్ కాలేజీలో డిగ్రీలో అడ్మిషన్ కోసం గణనీయంగా పోటీ పెరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు పట్ల విద్యావేత్తలు, యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.