👉 ఆసుపత్రిలో చేర్పించిన సిబ్బంది !
J.SURENDER KUMAR,
నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్‌కు చెందిన సయ్యద్ బాబా (38) గల్ఫ్ కార్మికుడు ముంబయి నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయి ఎయిర్ పోర్ట్‌లో విరామ సమయంలో ఆపస్మారక స్థితిలోకి జారుకున్న సంఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్‌లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు.
అస్వస్థతకు మత్తు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దుబాయిలోని రషీద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సయ్యద్ బాబాకు మెరుగైన వైద్యం అందించి, ఇండియాకు తిరిగి రప్పించాలని అతని భార్య సమీనా బేగం, సోదరుడు చోటు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వినతిపత్రం సమర్పించారు.

ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం, నారాగౌడ్‌లు కార్మికుడి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
👉 నాలుగు రోజులు ఏమయ్యాడో… తెలియని పరిస్థితి!
సౌదీకి వెళ్లే క్రమంలో ఈనెల 3న ముంబయి నుండి ‘ప్లయ్ దుబాయి’ విమానంలో బయలుదేరిన సయ్యద్ బాబా ముందుగా దుబాయికి చేరుకున్నాడు. అక్కడ తొమ్మిది గంటల విరామాన్ని ఎయిర్‌పోర్ట్‌లో గడిపాడు.
సాయంత్రం 4 గంటలకు దుబాయి నుండి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కలేకపోయాడు. అనంతరం అతని మొబైల్ స్విచ్‌ఆఫ్ అయి నాలుగు రోజులపాటు ఏమయ్యాడో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సహాయం కోసం ఈనెల 7న సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. దుబాయి ఎయిర్ పోర్ట్‌లో తప్పిపోయిన సయ్యద్ బాబా ఆచూకీ కనుగొనాలని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని వారు కోరారు. వెంటనే స్పందించిన ప్రవాసీ ప్రజావాణి బృందం ‘ప్లయ్ దుబాయి’ విమాన సంస్థను సంప్రదించగా, అతను దుబాయి రషీద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు నిర్ధారించారు.