👉 మాజీ మంత్రి హరీష్ రావును డిమాండ్ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
”హరీష్ రావు మీ కుటుంబ సభ్యురాలు, బంధువు కల్వకుంట్ల కవితక్క నీ అవినీతిపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై, ముందుగా సమాధానం చెప్పు. గత పది సంవత్సరాలు పాలనలో జరిగిన పాపాలు, మోసాల గూర్చి, నేరెళ్ల ఘటన పై ఆమె చేసిన ఆరోపణలకు సైతం సమాధానం చెప్పు” అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావును డిమాండ్ చేశారు.
కరీంనగర్ పట్టణంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడిన బుల్లెట్ పాయింట్స్ !
రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రజా సంక్షేమం, విద్య, బీసీ రిజర్వేషన్లు, దళిత సంక్షేమం వంటి అంశాలపై లోతుగా చర్చ జరిగిందని మంత్రి అన్నారు. దళిత, బీసీ, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే క్యాబినెట్ ఇది. అలాంటి క్యాబినెట్‌పై ‘దండుపాళ్యం’ అని అవహేళన చేయడం అన్యాయం, నీ స్థాయికి తగదు అని అన్నారు.
👉 సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి రమ్మని చెప్పిన శనివారం వస్తా, నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి, క్యాబినెట్‌లో జరిగిన ప్రతి అంశాన్ని స్వామి సాక్షిగా చెబుతా, అని మంత్రి అడ్లూరి , మాజీ మంత్రి హరీష్ రావ్ ను సవాలు సవాల్ చేశారు.
👉 డేట్, టైమ్ నేనే చెపుతాను సిద్ధమా హరీష్ రావు ? లేక నువ్వే చెబితే నేనే వస్తా,” అంటూ సూటిగా ప్రశ్నించారు.
👉 నీతి, ధర్మం, న్యాయం ఉంటే నా సవాల్ స్వీకరించు. తెలంగాణ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదారి పట్టించడం ఎక్కడివి? అని అడ్లూరి ప్రశ్నించారు.
👉 కాలేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కూలింది ? వేల కోట్ల రూపాయల అవినీతికి బాధ్యులు ఎవరు ? ముందు దానికి సమాధానం చెప్పండి. మీ హయాంలో రాష్ట్ర ఖజానా దోచుకోవడం, దాచుకోవడమే జరిగింది, అని మంత్రి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
👉 2004 ముందు నీ ఆస్తులు ఎంత ఉండేవి ? 2023 నాటికి ఎలాగో తెలియని రీతిలో ఆస్తులు కోట్లకు మించి అమాంతంగా పెరిగాయి. రబ్బరు చెప్పులు వేసుకున్న హరీష్ రావు కోట్ల ఆస్తులు సంపాదించారని పత్రికలే రాశాయి,” అని మంత్రి వ్యాఖ్యానించారు.
👉 దళిత–బీసీ వర్గాల ఎదుగుదల మీకు ఇష్టం లేదు దళితులు, బీసీలు క్యాబినెట్‌లో ఉండటం హరీష్ రావుకు తట్టుకోవడం లేదు. గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లను కూడా మీరు అవమానించారు, అని మంత్రి అడ్లూరి వ్యాఖ్యానించారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో దళితులకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా శాఖ సమస్యలను పరిష్కరిస్తున్నారు, అని మంత్రి వివరించారు.
👉 ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పై మా చిత్తశుద్ధిని ప్రశ్నించడం తగదు. ఆ తీర్మానాల సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు ? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 తెలంగాణ ఉద్యమంలో డప్పు కొట్టింది, గజ్జె కట్టింది మేమే. దళిత, బీసీ వర్గాలు అంటే కేసీఆర్‌కు గిట్టవు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలే బీజేపీకి ఓటు వేయమన్నారు, ఇది నిజం కాదా ? అని హరీష్ రావును ప్రశ్నించారు.
👉 మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులం ఇది సెక్యులర్ పార్టీ. మత రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కానీ బీజేపీతో కుమ్ముక్కు అయింది మీరే, అని మంత్రి స్పష్టం చేశారు.
👉 మా కరీంనగర్ జిల్లాకు చెందిన నీటిని సిద్ధిపేటకు మళ్లించడం ఏ న్యాయం ? ఇది సరికాదు. హరీష్ రావు, మీ నోరు అదుపులో పెట్టుకోండి. ప్రజా ప్రతినిధిగా మాట్లాడే బాధ్యత గుర్తుంచుకోండి, అని మంత్రి అడ్లూరి హెచ్చరించారు.
👉 మా ప్రభుత్వానికి మరో మూడు సంవత్సరాల సమయం ఉంది. ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేర్చుతాం. ఇప్పటికే నిరుద్యోగులకు గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలు పూర్తి చేసి నియామక పత్రాలు ఇచ్చాం అన్నారు.
👉 పేద ప్రజల ఇల్లు సహకారం చేసే దిశగా ఇందిరామ్మ ఇళ్ళను కట్టిస్తున్నాం. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును, అలాగే మహాలక్ష్మి లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నాం.
👉 మీ ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటు గ్రూప్ పరీక్షలు ఎందుకు నిర్వహించలేదు ? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 మీ ప్రభుత్వ పాలన లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు, కనీస మద్దతు ధర ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు మధ్యా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం,అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.