మల్లోజు లొంగుబాటు పై మౌనం వీడిన మావోయిస్టు పార్టీ !


👉 సోను సతీష్ ముఠాను బహిష్కరిస్తున్నాం మావోయిస్టు పార్టీ !


👉 మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటనలో..


J.SURENDER KUMAR,

దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  మల్లోజుల వేణుగోపాల్ @ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న తదితర అగ్ర నాయకులు, స్పెషల్ జోన్ కమిటీ నాయకులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ  సభ్యులు వందల సంఖ్యలో ఆయుధాలతో మహారాష్ట్ర, చత్తీస్గడ్, ప్రభుత్వాల ముందు లొంగి జనజీవన స్రవంతిలో  చేరికపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మౌనం వీడి లొంగుబాట్ల పై ప్రకటన జారీ చేసింది.

👉 ప్రకటనలో కొన్ని అంశాలు..

విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్చిన్నకులుగా, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువుకు లొంగిపోయిన సోను, సతీష్ లకు, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం, సోను, సతీష్ ముఠాను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాం అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అక్టోబర్ 16న విడుదల చేసిన నాలుగు పేజీల సుదీర్ఘ  ప్రకటనలో పేర్కొన్నారు.


👉 మా పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వివేక్. డీకే ఎస్.జెడ్.సీ. ప్రత్యమ్నాయ సభ్యురాలు దీప, 10 మంది డివిజనల్ కమిటీ/ కంపెనీ పార్టీకమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులు మొత్తం 61 మంది అక్టోబర్ 14 న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలీలో పోలీసులకు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసారు.


👉 మా పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన 50 తుపాకుల్ని శత్రువుకు అప్పగించారు. ఈ లొంగుబాటు విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య విప్ల ప్రతిఘాతకత అని పేర్కొన్నారు
.


👉 2011 చివరి నుండి గడ్డు స్థితిని ఎదుర్కొంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనకంజకు గురయ్యాయి.


👉 అప్పటినుండి సోనులో రాజకీయ బలహీనతలు బయటపడ్డూ వచ్చాయి. 2020 డిసెంబర్ లో జరిగిన కేంద్రకమిటీ సమావేశంలో సోను దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని కేంద్రకమిటీ తిరస్కరించింది.


👉 ఆ తర్వాత ఎప్పటికపుడు జరుగుతూ వచ్చిన కేంద్రకమిటీ (సీసీ), పొలిట్ బ్యూరో (పీబీ) సమావేశాల్లో ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి సీసీ, పీబీలు కృషి చేసాయి.


👉 2011లో జరిగిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ స్థానంలో సోనులోని వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని (బ్యురాక్రసిని) తీవ్రంగా విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఆ తర్వాత జరుగుతూ వచ్చిన డీకే ఎస్.జెడ్.సీ. సమావేశాల్లో ఎస్. జెడ్.సీ. సభ్యులు ఆయనలోని అన్యవర్గధోరణులను సరిదిద్దడానికి విమర్శలు పెడుతూ వచ్చారు.


👉  2025 మే నెలలో జరిగిన కగార్ దాడిలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు అమరత్వం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేసాయి.


👉 సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థం ఆ త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారితీసింది. ఈ విషయాన్ని నిజాయితీతో అంగీకరించడానికి ఆయన సిద్ధపడలేదు. కానీ ఆయన తనలో దీర్ఘకాలంగా ఉన్న అహంభావాన్ని సరిదిద్దుకొని ఫలితంగా తన బలహీనతలకు, ప్రాణభీతికి ముసుగు కప్పి పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ-సైనిక పంథా (వ్యూహం) ఫలితంగా భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారి తీసింది.


👉 ఈ స్థితిలో ఆయుధాల్ని శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు పత్రికా ప్రకటనను విడుదల చేసాడు.


👉 ఆయన ఈ మధ్య రాసిన వ్యాసాల్లో, ప్రజలకు విజ్ఞప్తి, కాడర్లకు విజ్ఞప్తి పత్రాల్లో, సెప్టెంబర్ 15 నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దీనికి భిన్నమైన పెటీబూర్జువా స్వీయాత్మక విశ్లేషణ పద్ధతి ఉంది. పార్టీ అనుసరిస్తున్న మౌలిక పంథా/ రాజకీయ- సైనిక పంథా లేదా రాజకీయ సైనిక వ్యూహాలు తప్పు అని నిర్ధారించడానికి ప్రధానంగా మూడు కారణాలను చెప్పాడు.


👉 మనకు విప్లవ పార్టీ లేదు. 2007 నాటి ఐక్యతా కాంగ్రెస్ రూపొందించిన కేంద్ర కర్తవ్యం ఉద్యమ బలానికి మించిన అతివాద నిర్ణయం, చట్టబద్ధ పోరాటాలను తిరస్కరించాం అని చెప్పాడు. ఈ మూడు తప్పుడు నిర్ధారణలు. దీంతోపాటు దళారీ నిరంకుశ బూర్జువా వర్గానికీ దేశ ప్రజానీకానికి మధ్యనున్న వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యంగా గుర్తించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను మార్చుకోవాలని ప్రకటించాడు.


👉 సోనుకు తను రాసిన వాటిపై విశ్వాసం ఉంటే పార్టీలో ఉంటూ, కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించడానికి సిద్ధపడాలి. ప్రాణత్యాగానికి సిద్ధపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాలను, తన వాదనలను కేంద్రకమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో తన వాదనల పట్ల తనకు విశ్వాసం ఉందని, నిజాయితీ ఉందని అంగీకరించే వాళ్లం.


👉 తప్పుడు వాదనలతో విప్లవ శిబిరాన్ని, పార్టీ కాడర్లను, పీ.ఎల్.జీ.ఏ. సభ్యులను మోసగించడం, శత్రువు ముందు లొంగిపోవడం విప్లవ ద్రోహమవుతుంది.


👉 సోను, ఆయన అనుచరులు శత్రువుకు లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని పార్టీకి అప్పగించాలని కేంద్రకమిటీ ఈ మధ్య విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసినప్పటికీ దాన్ని పాటించకుండా, 50 ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు.


👉 ఎంతోమంది కామ్రేడ్స్ శత్రు సాయుధ బలగాలతో పోరాడి ప్రాణాలర్పించి వారినుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్ని శత్రువుకు అప్పగించడమంటే విప్లవకారులను హత్య చేయడానికి విప్లవకారులను హత్య చేయమని శత్రువుకు అందించడమే. ఇది విప్లవ ప్రతిఘాతకత (కౌంటర్ రెవెల్యూషనరీ) అవుతుంది.


👉 సోను, సతీష్ లు శత్రువుకు సరెండరయినా, రేపు మరొకరు సరెండరయినా, మనపార్టీ శత్రువుకు సరెండర్ కాదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం. వర్గాలున్నంతకాలం వర్గపోరాటాలు- వాటి ఉన్నత రూపాలుగా ప్రజాయుద్ధాలు కొనసాగడం తిరుగులేని చారిత్రక నియమం. ఈ నియమాన్ని లొంగుబాట్లు మార్చలేవు. కాబట్టి తాత్కాలిక వెనకంజలో సైతం విప్లవోద్యమ పురోగమనం కోసం కృషి చేయడానికి గొప్ప ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ముందుకుసాగుదాం. అంతిమ విజయం ప్రజలదే అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.